ఎస్సై అవతారం కట్టి వచ్చిపోయే వాహనదారుల జేబులు లూటీ చేశాడు.. ఎక్కడంటే!

నకిలీ ఎస్సై అవతారం బట్టబయలైంది. ఎస్సై వేషం ధరించి వాహనాలను ఆపి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్న వ్యక్తిని నెల్లూరు జిల్లా సంగం పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ యూనిఫాం ధరించి చెక్ పోస్టుల వద్ద వాహనదారులను నిలిపి డబ్బులు దండుకోవడమే అతని ప్రధాన క్రీడగా మారింది. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అసలు కథ బయటపడింది.

సంగంలో నకిలీ ఎస్సైగా వ్యవహరిస్తూ ప్రజలను మోసం చేస్తున్న హరీష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, సీఐ వేమారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. హరీష్ 2023లో ఎస్సై ఫలితాల్లో సెలెక్ట్ అయ్యానని నమ్మించి, వాస్తవానికి ఎలాంటి నియామకం లేకుండానే నకిలీ ఎస్సైగా వేషధారణ చేసి ప్రజలను మోసం చేస్తున్నాడని తెలిపారు.

హరీష్ ప్రత్యేకంగా తనకు సరిగ్గా సరిపోయే ఎస్సై యూనిఫాంలను తయారు చేయించుకుని, బెల్ట్, సింహాలు, బూట్లు, నేమ్ ప్లేట్, టోపీ, నక్షత్రాలు అన్నీ సిద్దం చేసుకుని నకిలీ ఎస్సైగా మారిపోయాడు. చెక్ పోస్టుల వద్ద వాహనాలను ఆపి కాగితాలు పరిశీలిస్తున్నట్టు నమ్మించి నగదు వసూళ్లకు పాల్పడేవాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కారుతో పాటు నకిలీ ఎస్సై వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనను దర్యాప్తు చేసిన పోలీసుల సేవలను డీఎస్పీ అభినందించారు. ప్రజలు ఇలాంటి మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నకిలీ అధికారులపై అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.