మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఇంకా తమకు న్యాయం జరగలేదని ఆయన కుమార్తె సునీత రెడ్డి వాపోయారు. వివేకా వర్ధంతి సందర్భంగా పులివెందులలో నివాళులర్పించిన ఆమె.. ‘వివేకా హత్యకు గురై ఆరేళ్లయిందయిని.. ఈ కేసులో ఇంకా తమకు న్యాయం జరగలేద ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదని … నిందితుల్లో ఒకరు తప్ప మిగిలిన వాళ్లంతా బయటే తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో సీబీఐ మళ్లీ దర్యాప్తు మొదలు పెడుతుందని ఆశిస్తున్నానన్న సునీత..ఈ కేసులో సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారంటూ అనుమానం వ్యక్తం చేశారు.
ఈరోజు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి కావడంతో… పులివెందుల్లోని ఆయన సమాధి దగ్గర వైఎస్ సునీతా రెడ్డి నివాళులు అర్పించారు. తన తండ్రి వివేకానందరెడ్డి హత్య జరిగి ఆరేళ్లయ్యిందని గుర్తు చేసిన ఆమె.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతూనే ఉన్నానన్నారు. తన తండ్రి హత్య కేసులో ఒక్కరు తప్ప మిగిలిన అందరూ హాయిగా బయటే తిరుగుతున్నారని, అసలు ఈ కేసు విచారణ సరిగా జరగడం లేదని సునీత ఆరోపించారు. అసలు న్యాయం జరుగుతుందా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి ఎంతో పోరాడినా న్యాయం మాత్రం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన తండ్రి వివేకా హత్య కేసులో నిందితుల కంటే కూడా తమకు , తమ కుటుంబానికే ఇప్పుడు ఎక్కువ శిక్ష పడుతున్నట్లు తనకు అనిపిస్తోందని సునీత రెడ్డి అన్నారు. సీబీఐ అధికారులు మళ్లీ ఈ కేసులో విచారణ ప్రారంభించాలని కోరుతున్నానన్నారు. సాక్షులను, నిందితులను కాపాడే బాధ్యత ఏపీ ప్రభుత్వం తీసుకోవాలని.. సాక్షులపై కొందరు ఒత్తిడి తెస్తున్నారని సునీత ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు ముందుకు సాగనీకుండా కొందరు మేనేజ్ చేస్తున్నారని అనుమానం ఉందని చెప్పిన సునీత.. సాక్షుల వాంగ్మూలాలు వెనక్కి తీసుకోవాలని నిందితుల్లో కొందరు బెదిరిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేవారు. తన తండ్రి హత్య కేసులో కొంతకాలంగా వరుసగా జరుగుతున్న సాక్షుల మరణాలపై తమకు అనుమానంగా ఉందని చెప్పుకొచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరిగేంత వరకు కూడా తాను పోరాడుతూనే ఉంటాను గుర్తు చేశారు.
2019 మార్చి 15న తెల్లవారుజామున కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేకా తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ముందు గుండెపోటు అని, రక్తపు వాంతులంటూ ప్రచారం జరిగినా.. ఆ తర్వాత మాత్రం అది హత్య అని తేలిపోయింది. అదే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. తాజాగా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది హైకోర్టు. అయితే వివేకా హత్యకేసుకు లింక్ ఉన్నవాళ్లతో పాటు సాక్షులు వరుసగా చనిపోవడం కలకలం రేపుతోంది.