IPL 2025 గ్రాండ్ ఓపెనింగ్: మెగా ఈవెంట్‌లో సందడి చేయనున్న తారలు

క్రికెట్ ప్రపంచంలోని అత్యంత ప్రముఖ లీగ్ IPL 2025 కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. కేవలం 5 రోజుల్లో టోర్నమెంట్ ఆరంభం కానుండగా, ప్రేక్షకుల మూడ్‌ను పెంచేలా ఓపెనింగ్ వేడుక భారీగా నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ ఏడాది IPL 2025 ఆరంభ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది. ఈ హై-ఓక్టేన్ పోరుకు ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందు జరగనున్న ఓపెనింగ్ సెరిమనీ గురించి క్రికెట్ అభిమానులలో ఆసక్తి నెలకొంది. IPL నిర్వాహకులు ఈ వేడుకను ఎంతో వైభవంగా మార్చేందుకు ప్రముఖ కళాకారులను ఆహ్వానించారు.

ఓపెనింగ్ సెరిమనీలో ఎవరెవరు?
ప్రతి IPL ప్రారంభ వేడుకలో గ్రాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండడం సాంప్రదాయంగా మారింది. ఈసారి కూడా బీసీసీఐ పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేసింది. స్టేజ్‌ను తారల మెరుపులతో అలంకరించేందుకు బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని, సంగీత దిగ్గజం శ్రేయా ఘోషల్, పంజాబీ సింగర్ కరణ్ ఔజ్లా తమ అద్భుతమైన ప్రదర్శనలను ఇవ్వనున్నారు. వీటితో పాటు, ఇతర ప్రముఖ సెలబ్రిటీలు, డ్యాన్స్ ట్రూప్స్, లైటింగ్ ఎఫెక్ట్స్, ఫైర్‌వర్క్స్ ప్రదర్శనలు ఈ వేడుకను మరింత రసవత్తరంగా మార్చనున్నాయి.

ఈ మెగా ఈవెంట్ ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతాలో జరగనుంది. మార్చి 23, 2025 ప్రారంభ వేడుక సాయంత్రం 6:00 గంటలకు జరగనుంది. మ్యాచ్ ప్రారంభ సమయం: రాత్రి 7:30 గంటలకు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ మరియు Jio Cinema వేదికగా ఈ వేడుక లైవ్ ప్రసారం కానుంది.

టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?
ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మొదటి మ్యాచ్‌కు టిక్కెట్లు BookMyShow ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఈ మ్యాచ్ టిక్కెట్ కలిగి ఉన్న ప్రేక్షకులు ఓపెనింగ్ సెరిమనీని కూడా తిలకించవచ్చు. IPL ప్రారంభ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించాలని కోరుకునే అభిమానులు వీలైనంత త్వరగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

KKR vs RCB: రివేంజ్ మ్యాచ్!
గత సీజన్‌లో KKR, RCBపై రెండు విజయాలు సాధించింది. ఒక మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో, మరొకదాంటిలో 1 పరుగు తేడాతో గెలిచింది. దీంతో, RCB ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు, KKR విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని పట్టుదలగా ఉంది. IPL 2025 ప్రారంభ వేడుక అద్భుతంగా ఉండబోతోందని ఇప్పటికే అంచనాలు పెరిగాయి. మరిన్ని అప్‌డేట్స్ త్వరలో తెలియనున్నాయి!