సన్ రైజర్స్‌ వివాదంలో రేవంత్ ఎంట్రీ.. మారిన సీన్

ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌కు సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉచిత పాస్‌ల విషయంలో వివాదం నెలకొంది. వివాదం ముదరడంతో.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని..ఈ విషయంపై విచారణ నిర్వహించాలని విజిలెన్స్ అధికారులకు సూచించారు.

కాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉచిత పాస్‌లకు సంబంధించి తమను ఇబ్బంది పెడుతోందని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరోపిస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మేనేజర్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీకి రాసిన లెటర్ వెలుగులోకి రావడంతో ఇది సంచలనంగా మారింది. 12 ఏళ్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తో తాము కలిసి పని చేస్తున్నామని.. రెండేళ్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. వేధింపులు తలెత్తుతున్నాయని లేఖలో ఉంది. అలాగే తాము ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు 3,900 కాంప్లిమెంటరీ టికెట్లు ఇస్తున్నామన్న సన్ రైజర్స్..దీనిలో 50 కార్పొరేట్ బాక్స్ టికెట్లు ఇస్తున్నామని వివరించింది.

అయితే ఈ ఏడాది ఎఫ్ 12 ఏ కార్పొరేట్ బాక్స్ సామర్థ్యం 30 టికెట్లు మాత్రమే ఉందని..దీనివల్ల అదనంగా మరో బాక్స్ లో 20 టికెట్లు ఇవ్వాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మమ్మల్ని డిమాండ్ చేస్తుందని లేఖలో చెప్పింది. దీనిపై త్వరలోనే ఏదోక నిర్ణయం తీసుకుంటామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు వెల్లడించామని తెలిపింది. ప్రతి సీజన్ లో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ప్రతి మ్యాచ్ కు కూడా కోటిన్నర రూపాయలు అద్దె రూపంలో చెల్లిస్తున్నామని వివరించింది. అయినా కూడా గత మ్యాచ్లో ఎఫ్ బాక్స్ కు తాళం వేశారని గుర్తు చేసింది. చివరి నిమిషంలో మరో 20 టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని.. లేకపోతే బాక్స్ తెరిచేదే లేదంటూ బెదిరింపులకు పాల్పడటంతో..తాము చాలా ఇబ్బంది పడ్డామని చెప్పింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇలా బెదిరింపులకు పాల్పడటం తొలిసారి కాదని ఇవన్నీ చూస్తుంటే.. ఉప్పల్ స్టేడియంలో తమ జట్టు ఆడటం హెచ్ సీఏ కు ఇష్టం లేనట్టుగా కనిపిస్తోందని ఆరోపించింది. ఒకవేళ అదే వారి అభిమతమైతే.. బీసీసీఐతోనూ, తెలంగాణ ప్రభుత్వంతోనూ చర్చిస్తామని తర్వాత ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయి మరో వేదికను కచ్చితంగా చూసుకుంటామని.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు జనరల్ మేనేజర్ శ్రీనాథ్ లెటర్లో వివరించారు.

ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో.. హెచ్ సీఏపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే ఈ విషయంపై విచారణ జరపాలని ఇంటెలిజెన్స్ పోలీసులను ఆదేశించారు. కాగా ఈ లేఖ పై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా రియాక్ట్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ రాసిన లెటర్ అ వాస్తవమని కొట్టిపడేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి తమకు ఎటువంటి లెటర్ రాలేదని వివరించింది. అయితే హెచ్సీఏ అన్నట్లు ఆ లెటర్ అవాస్తవమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఎందుకు ఆదేశిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తప్పు కచ్చితంగా ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.