ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 127వ ఎపిసోడ్లో తెలంగాణకు చెందిన గొప్ప ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రం భీమ్ త్యాగాలను, ధైర్యాన్ని కొనియాడారు. “నిజాం దురాగతాలపై యోధుడు కుమ్రం భీమ్ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం” అని మోదీ అన్నారు.
కుమ్రం భీమ్ జీవితం – నిజాంపై పోరాటం:
ప్రధాని మోదీ 20వ శతాబ్దపు ప్రారంభంలో హైదరాబాద్లో నిజాం పాలనలో పేదలు, ఆదివాసీలపై జరిగిన దౌర్జన్యాలను గుర్తు చేశారు. భూములను లాక్కోవడం, భారీ పన్నులు, అన్యాయాన్ని నిరసించిన వారి చేతులు నరకడం వంటి దురాగతాలను ప్రస్తావించారు. కేవలం 40 సంవత్సరాలు మాత్రమే జీవించిన కుమ్రం భీమ్, నిజాం అధికారి సిద్ధిఖీని బహిరంగంగా సవాలు చేసి, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారని వివరించారు. భీమ్ ఇచ్చిన ‘జల్, జంగల్, జమీన్ హమారా’ నినాదం కోసం ఆయన ప్రాణాలర్పించారని పేర్కొంటూ నివాళులర్పించారు.
ఆదివాసీ గౌరవ దినోత్సవం, వందేమాతర వేడుకలు:
కుమ్రం భీమ్ ధైర్యం, త్యాగంతో లక్షలాది మంది హృదయాలపై, ముఖ్యంగా గిరిజన సమాజంపై చెరగని ముద్ర వేశారని మోదీ తెలిపారు. వచ్చే నెల 15న భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా నిర్వహించనున్న ‘ఆదివాసీ గౌరవ దినోత్సవం’ గురించి ప్రస్తావించారు.
వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు వచ్చే నెల 7తో ప్రారంభం కానున్నాయని తెలిపిన ప్రధాని, దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే, ‘ఆపరేషన్ సిందూర్’తో ఈ ఏడాది పండుగలు ఘనంగా జరిగాయని, భారతీయ కాఫీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.







































