రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్ల కుటుంబాలకు వచ్చే ఏడాది జూన్‌లోగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు అందజేయాలని ఆదేశించారు ముఖ్యంమత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు నేడు (సోమవారం, నవంబర్ 24) నూతనంగా ఏర్పాటు చేయనున్న ‘‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం’’ పై ఆయన సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో కుటుంబ సాధికారతను లక్ష్యంగా చేసుకుని, ప్రతీ కుటుంబం ఒక యూనిట్‌గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (FBMS)ను అమలు చేయాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక దిశానిర్దేశం చేశారు.
సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాలు
-
స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల జారీ: రాష్ట్రంలోని సుమారు 1.4 కోట్ల కుటుంబాలకు వచ్చే ఏడాది జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలని సీఎం ఆదేశించారు.
-
డేటా క్రోడీకరణ: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, పౌర సేవలు మరియు వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఈ వ్యవస్థలో పర్యవేక్షించాలి. రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) వద్ద ఉన్న డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలని సూచించారు.
-
కార్డులో వివరాలు: ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డులో 25 రకాల వివరాలతో పాటు P4 (అంటే ప్రగతి, ప్రజలు, పనితీరు, పారదర్శకత) వంటి అంశాలను కూడా చేర్చాలని తెలిపారు.
-
సమగ్ర వివరాల ట్రాకింగ్: ఈ ఎఫ్‌బీఎంఎస్ వ్యవస్థను కేవలం పింఛన్లు, రేషన్ వంటి పథకాల వివరాలకే పరిమితం చేయకుండా, పౌరులకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు (ఉదాహరణకు: టీకా వివరాలు, ఆధార్, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, స్కాలర్‌షిప్‌లు, పెన్షన్లు) నమోదు చేసేలా మరియు ట్రాకింగ్ చేసేలా రూపొందించాలని ఆదేశించారు.
-
లక్ష్యం – సుపరిపాలన: సుపరిపాలనలో భాగంగా, ఈ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందించడం, పౌర సేవలను సులభంగా అందించడం ప్రభుత్వ లక్ష్యం. దీని ద్వారా పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎదురవుతున్న సవాళ్లు కూడా పరిష్కారం అవుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
-
నిరంతర అప్‌డేట్: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యేలా చూడాలని, ఒకే కార్డు ద్వారా అన్ని వివరాలూ తెలిసేలా రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు, ఏపీ ప్రభుత్వం అమలు చేయనున్న ఈ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (FBMS) అనేది భవిష్యత్తులో పౌర సేవలు మరియు సంక్షేమ పథకాల పంపిణీలో సమూల మార్పులు తీసుకురానుందని అంచనా.
కాగా, రియల్ టైమ్ గవర్నెన్సు డేటా లేక్ ద్వారా వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందిస్తున్న వివిధ పౌర సేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం ఉండనుంది. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.విజయానంద్, ఆర్ధిక, వైద్యారోగ్యం, పౌరసరఫరాలు, పురపాలక, ఐటీ, ప్లానింగ్ విభాగం ఉన్నతాధికారులు హాజరయ్యారు.







































