ఏపీలో పోలీసు కొలువుల పండుగ.. సీఎం, డిప్యూటీ సీఎం చేతులమీదుగా నియామక పత్రాల పంపిణీ

CM Chandrababu and Dy CM Pawan Kalyan Distributes Appointment Letters to 5,757 Constables

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్‌లోని పరేడ్ మైదానంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు లాంఛనంగా నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కొలువుల వేడుకగా నిర్వహించింది. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు మరియు వారి కుటుంబ సభ్యులు సహా 17,000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇక ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ వంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు.

ఉద్యోగ నియామకంలో వేగం, పారదర్శకత

నియామక పత్రాల పంపిణీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కానిస్టేబుల్ నియామక ప్రక్రియను గత ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేయగా, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి, దేహదారుఢ్య పరీక్షలు, తుది రాత పరీక్ష వంటి ప్రక్రియను కేవలం ఏడాదిలోనే పూర్తి చేసి ఫలితాలను విడుదల చేశామని వివరించారు.

మొత్తం 6,100 పోస్టులకు గాను, ‘శిక్షణకు అర్హత’ పొందిన 5,757 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. వీరిలో 3,343 మంది సివిల్ కానిస్టేబుళ్లుగా, 2,414 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. అలాగే, ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి 183 మంది ఆదివాసీలు ఉద్యోగాలు పొందడం విశేషం.

శిక్షణలోనూ ఆధునిక మార్పులు

కాగా, ఈ నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులందరికీ ఈ నెల 22వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. మొత్తం 9 నెలల పాటు కొనసాగే ఈ కఠోర శిక్షణలో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా మాడ్యూల్స్‌, సబ్జెక్టుల్లో అనేక మార్పులు చేశారు.

ఈసారి ఉద్యోగాలకు ఎంపికైన వారిలో బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ వంటి సాంకేతిక కోర్సులు చేసినవారు ఎక్కువగా ఉండటంతో, వారి నైపుణ్యాలను మెరుగుపరిచేలా శిక్షణ ఉండనుంది. ఈ శిక్షణ పూర్తి చేసుకుని అభ్యర్థులంతా త్వరలో విధుల్లో చేరనున్నారు. నియామక పత్రాలు పొందిన అభ్యర్థులందరినీ పోలీసు శాఖే ప్రత్యేక బస్సుల్లో వారి స్వస్థలాలకు తరలించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here