దేశంలో ఈ రోజు నుంచి (మే 25, సోమవారం) నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో కూడా దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమవడంతో ప్రయాణికుల రాకపోకలకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా తగు ఏర్పాట్లు చేపట్టామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా నిలిచిపోయిన విమాన ప్రయాణాలు హైదరాబాద్ కు ఈ రోజు ప్రారంభమయ్యాయి. దేశంలోని వివిధ ప్రధాన నగరాలనుండి హైదరాబాదుకు, ఇక్కడినుండి ఇతర నగరాలకు దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభంకావడంతో సీఎస్ సోమేష్ కుమార్, జీ.ఏ.డీ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ లతో కలసి ఎయిర్ పోర్ట్ చేసిన ఏర్పాట్లను ఈ రోజు ఉదయం పరిశీలించారు.
ఈ సందర్బంగా విలేకరులతో సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, నేడు 19 విమానాలు హైదరాబాద్కు రావడంతో పాటు మరో 19 విమానాలు హైదరాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రయాణికుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రధానంగా ఎయిర్ పోర్ట్ నుండి వెళ్లే ప్రయాణికులకు, ఇతర నగరాల నుండి వచ్చే ప్రయాణికులకు టెంపరేచర్ ను పరీక్షించడం జరుగుతుందని, టెంపరేచర్ తో కరోనా లక్షణాలుంటే రెగ్యులర్ ప్రోటోకాల్ పాటించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకున్నామని, ప్యాసింజర్ని టచ్ చేయకుండా సెన్సార్లు ఏర్పాటు చేసామని చెప్పారు. ఇప్పటి వరకు వచ్చిన ఎవరికి కూడా కరోన లక్షణాలు లేవని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం సెక్యూరిటీ పరంగా, ఆరోగ్య పరంగా ఎయిర్ పోర్ట్ లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు.
ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి అని,ఆరోగ్య సేతు యాప్ ఉన్నవాళ్లనే అనుమతిస్తున్నామన్నారు. ఇప్పుడు వచ్చే వారికి పరీక్షల అనంతరమే అనుమతిస్తున్నామని, ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారికి 14 రోజుల క్వారంటైన్ లేదని తెలిపారు. దాదాపు 1600 మంది ఇతర రాష్ట్రాల నుండి నేడు హైదరాబాద్కి వస్తున్నారన్నారు. ప్రయాణికులు లేకుంటే మాత్రమే విమానాలు కాన్సల్ అవుతున్నాయని చెప్పారు. రేపటి నుండి మరిన్ని విమాన సర్వీస్లు పెరిగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. విదేశీ విమాన సర్వీస్ టర్మీనల్లను కూడా సందర్శించామన్నారు. ప్రభుత్వం, ఎయిర్పోర్టు అథారిటీ లు సూచించే సూచనలు, సలహాలు ప్రతి ప్రయాణికుడు పాటించాలని, ఎవరికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని సీఎస్ సోమేష్ కుమార్ పేర్కొన్నారు.విమానాశ్రయంలోకి ప్రవేశించిన దగ్గరినుండి విమానం ఎక్కేదాకా భౌతిక దూరం పాటిచండం, ప్రయాణికుల లగేజీతోపాటు ట్రాలీ వాహనాలను కూడా పూర్తిగా శానిటైజ్ చేసేందుకు ప్రత్యేక టన్నెల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu