
ఏపీలో ఎన్నికలలో గెలిచేదెవరో జూన్ 4న తేలనుండటంతో అందరి చూపూ ఆ తేదీమీదే పడింది. ఎవరి గెలుపోటములు ఎలా ఉన్నా టీడీపీలో సీనియర్ నేత అశోక గజపతిరాజు కుమార్తె గెలుపును ఆయనే పంతంతో అడ్డుకున్నారా అన్న టాక్ నడుస్తోంది. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంనుంచి నుంచి ఈసారి వైసీపీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి నిలబడగా..టీడీపీ అభ్యర్ధిగా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కూతురు అదితి గజపతిరాజు పోటీ చేశారు. అటు టీడీపీ రెబల్ అయిన మీసాల గీత ఇండిపెండెంట్ అభ్యర్దిగా బరిలో దిగారు.
నిజానికి విజయనగరం అసెంబ్లీ సీటును మున్సిపల్ చైర్మన్ గా, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన మీసాల గీత ఆశించారు.కానీ అశోక్ గజపతిరాజు తన కుమార్తెకు ఆ సీటును ఇప్పించుకున్నారు. దీంతో అదితి గజపతిరాజు టీడీపీ తరఫున నిలబడటంతో.. సీటు ఆశించిన మీసాల గీత రెబల్ గా పోటీ చేశారు. ఆమెను పోటీ నుంచి తప్పించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా గీత ససేమిరా అనేసారట. అయితే టీడీపీ అధికారంలోకి వస్తే.. మీసాల గీతకు ఎమ్మెల్సీ లేదా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇవ్వడంతో అప్పుడామె కాస్త మెత్తబడ్డారట.
కానీ తన వద్దకు అశోక్ గజపతిరాజు వచ్చి మద్దతు అడగితేనే పోటీ నుంచి విరమించుకుంటానని గీత కండిషన్ పెట్టారట. కనీసం కనీసం తనకు ఫోన్ చేసి తన మద్దతును కోరినా పర్వాలేదని డిమాండ్ చేయగా..దీనికి అశోక్ గజపతిరాజు ఏమాత్రం ఇష్టపడలేదట. తనంతట తాను మీసాల గీత మద్దతు కోరనని చెప్పేశారట. దీంతోనే గీత రెబల్ గా నిలబడి ఏరి కోరి గాజు గ్లాసు గుర్తును తెచ్చుకుని మరీ బరిలోకి దిగారట. దీంతో ఈ ఎన్నికలలో విజయనగరంలో ముక్కోణపు పోటీ జరిగినట్లు ప్రచారం జరిగింది.
గతంలో మున్సిపల్ చైర్మన్ గానూ, ఎమ్మెల్యేగానూ మీసాల గీత పనిచేయడంతో ఆమెకు స్థానికంగా విస్తృత పరిచయాలు ఉన్నాయి. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ తరఫున కూడా ఆమె పోటీ చేసి ఓడిపోయినా ప్రజల్లో మంచి సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. ఈ పరిచయాలతో మీసాల గీత భారీ ఎత్తున ప్రచారం చేసుకుని.. వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు బలమైన పోటీ నిచ్చారు. అందులోనూ గీతకు గాజు గ్లాసు గుర్తు లభించడం ఆమెకు మరింత కలిసి వచ్చిందన్న వాదన వినిపిస్తోంది.
వైఎస్సార్సీపీ అభ్యర్థి వీరభద్రస్వామి వైశ్య కులానికి చెందినవారు కాగా.. అదితి క్షత్రియ సామాజికవర్గానికి చెందినవారు. ఇటు మీసాల గీత బీసీ కులానికి చెందిన తూర్పు కాపులు. విజయనగరంలో ఎక్కువ మంది తూర్పు కాపులే ఉండటంతో మీసాల గీతకు ఎక్కువ శాతం విజయావకాశాలున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో అశోక్ గజపతిరాజు అప్పుడు తాను అనవసరంగా పంతానికి పోయారంటూ ఆయన వర్గీయులు వాపోతున్నారట. అప్పుడు గీతను మద్దతు అడిగి ఉంటే అసలు ఆమె పోటీలోనే ఉండేవారు కాదు కదా అప్పుడు అదితికే గెలిచే అవకాశాలు ఉండేవని అంటున్నారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY