రాజధాని అమరావతి ప్రాంత రైతులు, అమరావతి జేఏసీ నేతలు ఫిబ్రవరి 4, మంగళవారం నాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును (మూడురాజధానుల బిల్లు) రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు, రైతుల ఆందోళనలు, ఆందోళన సమయంలో పోలీసుల వ్యవహరిస్తున్న తీరు, పలు ఇతర అంశాలను రైతులు వెంకయ్యనాయుడి దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించే విధంగా, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా సహాయం చేయాలని కోరారు. రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
మరోవైపు బీజేపీ పెద్దలను, పలువురు కేంద్ర మంత్రులను కూడా అమరావతి రైతులు కలవనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్షనేతలను కలవబోతున్నట్టు రైతులు పేర్కొన్నారు. అలాగే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్మెంట్ కోరామని, అవకాశం దొరకగానే వారికీ కూడా తమ సమస్యలను తెలియజేస్తామని చెప్పారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన వారిలో రైతులతో పాటుగా టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, సీతారామలక్ష్మి ఉన్నారు.
[subscribe]













































