గ్రామాల్లోకి అన్నా క్యాంటిన్లు: పయ్యావుల కేశవ్

Anna Canteens Into Villages Payyavula Keshav

ఏపీలో అన్నా క్యాంటిన్లు విజయవంతంగా నిర్వహించడుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటి వరకు పట్టణాల్లోనే ఉన్న ఈ అన్నా క్యాంటిన్లు ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించబోతున్నాయి. 2024-25 సంవత్సరానికి ఐదు నెలల కాలం కోసం బడ్జెట్ తీసుకొచ్చిన ప్రభుత్వం త్వరలోనే గ్రామాల్లో అన్న క్యాంటీన్లు తీసుకొస్తామని చెప్పింది. పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఆహారాన్ని అందించేందుకు 123 ప్రాంతాల పరిధిలో 204 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసినట్టు బడ్జెట్ ప్రసంగంలో పయ్యావు కేశవ్ తెలిపారు. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కూడా 158 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వివరించారు. దీని కోసం బడ్జెట్‌లో ఎంత ఖర్చు పెడుతుందో మాత్రం చెప్పలేదు. ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో కూడా క్లారిటీ లేదు.

గత టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. పట్టణాలు, నగర ప్రాంతాల్లోని ఆసుపత్రులు, కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ….అన్న క్యాంటీన్లను మూసివేసింది. కొన్ని చోట్ల టీడీపీ నేతలు సొంత నిధులతో అన్న క్యాంటీన్లు నడిపారు. అన్న క్యాంటీన్లు మూసివేతపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. పట్టణాల్లో పేదలకు పట్టెడన్నం పెట్టే క్యాంటీన్లు మూసివేడడం ఎందుని, పేరు మార్చి కొనసాగించాలని కోరారు. అయితే వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ల మూసివేతకే నిర్ణయించింది. 2024లో రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి టీడీపీ కూటమి… క్యాంటీన్లను ప్రారంభించింది.

ప్రజలపై ఇంతటి ప్రభావం చూపిన అన్న క్యాంటీన్లు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా భరీ ఎత్తున అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించింది. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇప్పటి వరకు 204 అన్నక్యాంటీన్లు రన్ అవుతున్నాయి. ఇక్కడ రూ.5కే టిఫిన్, రూ.5కే భోజనం అందిస్తున్నారు. టిఫిన్ లో ఇడ్లీ చట్నీ లేదా ఏదైనా పొడి, సాంబార్ ఇస్తారు. ఆదివారం మినహా సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం పెడతారు. అన్నంతోపాటు కూర, పప్పు లేదా సాంబారు, పెరుగు, పచ్చడి వడ్డిస్తారు. భోజనం సమయంలో 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల పప్పు , 100 గ్రాముల కూర , 15 గ్రాముల పచ్చడి, 75 గ్రాముల పెరుగు వడ్డిస్తారు.