ఏపీలో అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించిన గుడివాడలో సీఎం చంద్రబాబు తొలి అన్న క్యాంటీన్‌ను మరోసారి ప్రారంభించారు. అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం ప్రజలకు తన భార్య నారా భువనేశ్వరితో కలిసి వడ్డించారు. ఆ తర్వాత ప్రజలతో కలిసి అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు కుటుంబ సమేతంగా భోజనం చేశారు. భోజన చేస్తూనే ప్రజలతో మాట్లాడారు. భోజనం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. కాకినాడలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్‌ను ఉపముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. పవన్ మాట్లాడుతూ, “ఇది ఒక గొప్ప కారణం. ఇకపై ఎవరూ ఆకలితో ఉదయం ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదన్నారు.
మాది పేదల ప్రభుత్వం. ఆర్థిక కష్టాలున్నప్పటికీ సామాజిక పింఛన్లు పెంచి అందిస్తున్నాం. పేదల ఆకలి తీర్చేందుకు నేటి నుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి ప్రజలు భాగస్వాములు కావాలి. పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యాల రోజున విరాళాలు ఇస్తే మీ పేరున భోజనం పెడతాం అని తెలిపారు. గతంలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ఏర్పాటైన ప్రాంతాల్లోనే అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించబడుతున్నాయి. అలాగే కొత్త క్యాంటీన్లను ప్రారంభించేందుకు అనువైన ప్రదేశాలను కూడా అన్వేషిస్తున్నారు.
గత టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా 4.60 కోట్ల మందికి ఆహారాన్ని సరఫరా చేసింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం క్యాంటీన్లన్నింటినీ మూసివేసింది. కాగా, ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున అన్న క్యాంటీన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కోటి రూపాయల విరాళం అందించారు. అన్న క్యాంటీన్లకు హరే కృష్ణ ఫౌండేషన్ ఆహారాన్ని సరఫరా చేస్తుంది. ప్రతి రోజు మెనూ భిన్నంగా ఉంటుంది. అల్పాహారంలో ఇడ్లీ, ఉప్మా, పొంగల్, చట్నీ, సాంబార్ , కారం పొడి వంటివి ఉంటాయి. లంచ్ , డిన్నర్ కోసం, వైట్ రైస్, కూర, సాంబార్, చట్నీ, పెరుగు కేవలం 5 రూపాయలకే వడ్డిస్తారు.
క్యాంటీన్ల మెనూ..
సోమవారం నుంచి శనివారం వరకు రోజూ ఉదయం అల్పాహారం కింద ఇడ్లీ-చట్నీ/పొడి, సాంబార్. ఇడ్లీతోపాటు సోమవారం, గురువారం పూరీ, కుర్మా, మంగళవారం, శుక్రవారం ఉప్మా, చట్నీ, బుధవారం, శనివారం పొంగల్ చట్నీ, మిక్చర్ అందుబాటులో ఉంటాయి. ఇడ్లీ వద్దనుకునే వారు ప్రత్యామ్నాయంగా పూరీ, ఉప్మా, పొంగల్ తీసుకోవచ్చు. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ మధ్యాహ్నం, రాత్రి అన్నంతోపాటు కూర, పప్పు/ సాంబారు, పెరుగు, పచ్చడి అందిస్తారు. తాగునీటి సౌకర్యం, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం క్యాంటీన్లకు సెలవు. వారానికోసారి ప్రత్యేక ఆహారం అందిస్తారు.
ఆహార పరిమాణం: ఇడ్లీ/పూరి 3, ఉప్మా, పొంగల్ 250 గ్రాములు. అన్నం 400 గ్రాములు, చట్నీ/ పొడి 15 గ్రాములు, పప్పు 120 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, మిక్చర్ 25 గ్రాములు, కూర 100 గ్రాములు, పచ్చడి 15 గ్రాములు, పెరుగు 75 గ్రాములు ఇస్తారు.
క్యాంటీన్లు తెరిచి ఉంచే సమయం
అల్పాహారం: ఉదయం 7.30 నుంచి 10, మధ్యాహ్న భోజనం: 12.30 నుంచి 3, రాత్రి 7.30 నుంచి 9 గంటలు.