ఆంధ్రప్రదేశ్‌లో పాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం సచివాలయంలో సుమారు 4 గంటల పాటు విస్తృతంగా చర్చించిన ఉపసంఘం, మార్కాపురం మరియు మదనపల్లె కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేసింది. అలాగే, పాలనా సౌలభ్యం కోసం అదనంగా ఆరు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైనా దృష్టి సారించింది.
జిల్లా సరిహద్దుల్లో మార్పుల విషయానికి వస్తే, ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో తిరిగి చేర్చే ప్రతిపాదనకు ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఇంకా, కృష్ణా జిల్లాలోకి కైకలూరు నియోజకవర్గాన్ని, తిరుపతి జిల్లా నుంచి గూడూరు నియోజకవర్గాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. అయితే, గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుంది.
ఇక, కొత్తగా పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర, నక్కపల్లి, బనగానపల్లి వంటి ఆరు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా ఉపసంఘం అంగీకరించింది. మరోవైపు స్థానిక ప్రజలు కోరుతున్నప్పటికీ, విజయవాడలో భాగమైన పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశాన్ని మాత్రం ఉపసంఘం పరిశీలించకపోవడం గమనార్హం.
ముఖ్యంగా చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లను అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే కొనసాగిస్తూ ప్రత్యేక పోలవరం అథారిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. రెవెన్యూ డివిజన్ల, మండలాల మార్పుచేర్పులపై మూడు రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని ఉపసంఘం రెవెన్యూ శాఖను ఆదేశించింది.
































