పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై ఏపీ సీఎం జగన్ కీలక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని ఉపాధి హామీ పనులు, వైఎస్సార్‌ జలకళ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, మంచినీటి సరఫరా, తదితరాలపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్ నిర్దేశించారు. అమూల్‌ పాల సేకరణ చేస్తున్న జిల్లాలు, ప్రాంతాలకు అనుగుణంగా బీఎంసీయూలను పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి వస్తున్న నిధులను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో వీటిని పూర్తి చేసేలా కార్యాచరణతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు.

వైఎస్సార్‌ జలకళ పురోగతిపై కూడా ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్గు అప్పగించి వాటి ద్వారా రైతుల పొలాల్లో బోర్లు తవ్వాలని సూచించారు. బోరు తవ్విన వెంటనే మోటారు కూడా బిగించాలని స్పష్టం చేశారు సీఎం జగన్. జగనన్న కాలనీల్లో రక్షిత  మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిధుల కొరత లేకుండా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, ప్రాసెసింగ్‌ను ముఖ్యమంత్రి సమీక్షించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. గ్రామాల్లో పరిశుభ్రత మరింత మెరుగుపడాలని, మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఏడాదిలోగా పనులు పూర్తి కావాలని, నిర్వహణపై కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు. అలాగే, రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, నిర్మాణంపై అత్యుత్తమ కార్యాచరణ రూపొందించి ఏ దశలోనూ నిర్లక్ష్యానికి గురికాకుండా క్రమం తప్పకుండా నిర్వహణ చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ