ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన ముస్లిం సంఘాల ప్రతినిధులతో సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ముస్లిం సంఘాల ప్రతినిధులు సీఎంకి వివరించారు. వక్స్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వక్స్ బోర్డు ఆస్తుల పరిరక్షణ, మదరసాలలో విద్యా వాలంటీర్లకు జీతాలు చెల్లింపు, ముస్లింల అభ్యన్నతికి సలహాదారు నియామకం వంటి అంశాలను ముస్లిం పెద్దలు సీఎంకు విన్నపించారు. ముస్లిం సంఘాల ప్రతినిధులు విన్నవించిన పలు అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించారు. కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణం చేపట్టాలని ముస్లిం సంఘాలు విజ్ఞప్తి చేయగా, హజ్ హౌస్ నిర్మాణం కోసం అవసరమైన భూమి కేటాయించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే వక్స్ బోర్డు ఆస్తుల రక్షణకై తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణకు సీఎం హామీ ఇచ్చారు.
అన్ని మతాల భూముల ఆస్తులు పరిరక్షణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ నియమించాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా స్థాయిలో ఈ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జేసీ, ఏఎస్పీలతో ఒక కమిటీ వేసి, జిల్లాస్థాయిలో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఖాజీల పదవీ కాలం మూడేళ్లుగా నిర్ణయించిందని సీఎం దృష్టికి తీసుకొచ్చి, ఖాజీల రెన్యువల్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని ముస్లిం సంఘాల పెద్దలు నివేదించారు. ఖాజీల పదవీకాలాన్ని పెంచడంతో పాటు రెన్యూవల్ ప్రాసెస్ను సులభతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఖాజీల పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి పదేళ్లకు పెంచడానికి సీఎం ఆదేశించి, గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో సులభతరమైన రెన్యువల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని అధికారులకు సూచించారు. మదరసాలలో పనిచేస్తున్న విద్యావాలంటీర్ల జీతాలు సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఉర్దూ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నాటికి బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ లో భాగంగా ఇంగ్లీష్ తో పాటుగా ఉర్దూలో కూడా ఉండేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. కర్నూలు ఉర్దూ విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలన్నారు. సయ్యద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముస్లిం మతపెద్దలు విజ్ఞప్తి చేయగా, కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ముస్లింలకు ఈ ప్రభుత్వంలో ఇచ్చిన పదవులు మరే ప్రభుత్వంలోనూ ఇవ్వలేదు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లుగా పెద్ద ఎత్తున అవకాశం కల్పించామని అన్నారు. “ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. భగవంతుడి దయ వలన, మీ అందరి ఆశీర్వాదం, మీ సహాయ సహకారాలతోనే ఈ ప్రభుత్వం ఏర్పడింది. ఇది మనందరి ప్రభుత్వం అన్న విషయాన్ని మనసులో పెట్టుకొండి. ప్రభుత్వం నుంచి మీకు ఏ రకంగా మరింత సహాయం చేయాలన్నదానిపై మీ సలహాలు తీసుకోవడానికే ఇవాళ మిమ్మల్ని పిలిచాం. మీరు చెప్పిన అన్ని అంశాలను యుద్ధ ప్రాతిపదికిన పరిష్కరిస్తాం. మీరు చెప్పిన సమస్యలను పరిష్కరించడంతో పాటు అవసరమైన నిధులును కూడా కేటాయిస్తాం. అన్ని సమస్యలకు సానుకూలమైన పరిష్కారం ఈ సమావేశం ద్వారా లభిస్తుంది. ఈ దఫా మన లక్ష్యం 175 కి 175 స్థానాలు గెలవడం. కచ్చితంగా దాన్ని సాధిస్తాం. ప్రతి ఇంటికి, ప్రతి గడపకూ మంచి చేశాం. దేవుడి దయతో ఇదంతా చేయగలిగాం. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు” అని ముస్లిం మతపెద్దలును ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE