మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకే కాకుండా, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూత అందించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయడానికి సిద్ధమైంది.
ఈ క్రమంలో నిత్యావసర సరుకుల పంపిణీపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. నిత్యావసరాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి మరియు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు.. అలాగే చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇక ఈ పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కందిపప్పు ఒక కేజీ, పామాయిల్ ఒక లీటర్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార ఒక్కో కేజీ చొప్పున ఇవ్వనున్నారు. ప్రత్యేకంగా మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం కేటాయించనున్నారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 14,415 రేషన్ షాపుల్లో 1 లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3,424 మెట్రిక్ టన్నుల పంచదార, ఇతర నిత్యావసరాలను ఇప్పటికే పంపిణీకి సిద్ధం చేశారు.
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ఆహార సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ అనగాని పర్యవేక్షణలో సహాయక చర్యలు, ఆహారం మరియు నిత్యావసరాల పంపిణీ వేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు తుపాన్ ప్రభావిత ప్రజలకు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయని అధికారులు పేర్కొన్నారు.








































