మద్యం విక్రయాలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. దీనిపై సోమవారం భారీ జరిమానాలు విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంఆర్‌పి కంటే ఎక్కువ ధరలకు మద్యాన్ని విక్రయిస్తే 5 లక్షల రూపాయల వరకు జరీమానా విధిస్తామని పేర్కొంది.
అలాగే మద్యం షాపుల పరిధిలో కనుక.. బెల్టుషాపులను నిర్వహిస్తే 5 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. రెండోసారి కూడా అదే తప్పు చేస్తే షాప్ లైసెన్స్‌ను కూడా రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఏపీ ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 47(1) కింద నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బార్ లైసెన్సులకు సైతం ఇవే నిబంధనలు వర్తిస్తాయని తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మద్యం విక్రయాలకు సంబంధించి పెనుమార్పులను తీసుకొచ్చింది. జగన్ హయాంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలన్నీ రద్దు చేసి.. కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. ప్రైవేట్ మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు వార్తలు రావడంతో ఈ కొత్త నిర్ణయం తీసుకుంది.
ఏపీలో చాలా చోట్ల ఎమ్మార్పీ ధరల కంటే కూడా ఎక్కువ ధరలకు విక్రయిస్తుండటంతో..కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటు ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. అన్ని మద్యం షాపుల్లో ఎంఆర్‌పీ ధరలకు మద్యాన్ని అమ్మాలని చెప్పారు. ఎమ్మార్పీ కంటే ఒక రూపాయి ఎక్కువ విక్రయం జరిగినా 5 లక్షలు రూపాయల జరీమానా విధిస్తామని హెచ్చరించారు. మళ్లీ మళ్లీ అదే పని చేస్తే షాపులకు ఇచ్చిన అనుమతులు రద్దవుతాయని చెప్పారు.