ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామపంచాయతీలలో ఖాళీగా ఉన్న సర్పంచులు, వార్డు మెంబర్ల ఖాళీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఖాళీల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రామ పంచాయతీల్లో 14వ తేదీన, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో 16న ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వేలిపై సిరా గుర్తు విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఓటు వేసే సమయంలో చెరగని సిరా గుర్తును ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుపై పెడతారు. అయితే చెరగని సిరా గుర్తు 5 నుండి 7 రోజుల వరకు ఉండి గోరుపై కనిపిస్తుంది. కాగా గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ-జెడ్పీటీసీ ఎన్నికలు ఒక్కరోజు వ్యవధిలో జరగనున్నాయి. కొన్ని చోట్ల గ్రామపంచాయితీ ఎన్నికల్లో 14న ఓటు వేసిన ఓటర్లు, ఎంపీటీసీ-జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా ఓటు వేయవలసి ఉంటుంది.
ఈ నేపథ్యంలో పోలింగ్ సిబ్బందిలో గందరగోళాన్ని నివారించడానికి గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలలో చెరగని సిరా గుర్తుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 14న జరగనున్న గ్రామ పంచాయతీల పోలింగ్ లో ఓటు వేసే ఓటర్లకు ఎడమ చేతి చూపుడు వేలుపై మరియు 16న జరిగే ఎంపీటీసీ-జెడ్పీటీసీ పోలింగ్ లో ఓటర్లకు ఎడమ చేతి చిటికెన వేలిపై సిరా గుర్తు వేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు అన్ని చోట్ల రిటర్నింగ్ అధికారులు/ప్రిసైడింగ్ అధికారులు మరియు ఇతర పోలింగ్ అధికారులకు అవసరమైన సూచనలను అందించాలని ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ






































