పల్నాడులో జూన్ 2 వ తేదీ సాయంత్రం నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు వ్యాపారాలు బంద్ చేయాలని పోలీసులు ప్రకటించడంతో అక్కడి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ వల్ల పోలీసులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కౌంటింగ్ డే రోజు నరసరావుపేటను పోలీసులు అష్టదిగ్బంధనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
జూన్ 4న కౌంటింగ్ హాల్‌లోకి ప్రవేశించడానికి ముందే రాజకీయ నేతలు, అభ్యర్థులందరి ఎన్నికల ఏజెంట్లకు మద్యం పరీక్షలు నిర్వహిస్తామని పల్నాడు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మాలిక గార్గ్ చెప్పారు. పాజిటివ్ వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ హాల్లోకి అనుమతించబోమని అన్నారు.అందుకే జూన్ 4న కౌంటింగ్ కేంద్రానికి వచ్చే వారెవరయినా సరే.. తాము హాల్ లోకి ఎంటర్ అయ్యే ముందు నిర్వహించే బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా అంటే జూన్ 3న నుంచే మద్యానికి దూరంగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు.
కౌంటింగ్ కేంద్రం దగ్గర మద్యం పరీక్షల కోసం పోలీసులు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మూడు వేల మంది పోలీస్‌లతో పల్నాడులో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. దుకాణాలతో పాటు వేరే ప్రాంతాల నుంచి వచ్చేవారెవరూ పల్నాడులో ఉండటానికి వీలు లేకుండా లాడ్జిలు, కళ్యాణ మండపాలను కూడా మూసివేయాలని పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పల్నాడు జిల్లాలో కౌంటింగ్ సందర్భంగా పోలీసుల భారీ పహారా నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రం అయిన నరసరావుపేటలో ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులతో పాటు నలుగురు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డిఎస్పీల మకాం వేయనున్నారు. అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరాయంగా పర్యవేక్షించనున్నారు.
కౌంటింగ్ సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని , ఎన్నికల సంఘం కఠిన ఆదేశాలతో అప్రమత్తమయిన పల్నాడు పోలీసులు.. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్‌ను విధించారు.దీంతో పాటు జూన్ 2 నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు వాణిజ్య వ్యాపార కలాపాలన్నిటిని పూర్తిగా బంద్ చేయాలని ప్రకటించేశారు. అలాగే కౌంటింగ్ సమయంలో ఎవరైనా సరే చిన్నపాటి ఘర్షణలకు పాల్పడినా కూడా వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY