తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి అంబరాన్నంటుతోంది. పల్లెలు పండుగ ఉత్సాహంతో కదలాడుతుండగా, కోడి పందాలు పల్లె సంస్కృతికి మరోసారి సజీవ సాక్ష్యం కావడం విశేషం. కోళ్ల కాలికి కత్తులు కట్టి “రయ్యి రయ్యి” అంటూ పందాలు ఉత్సాహాన్ని మరింత పెంచుతున్నాయి. అయితే, ఈ ఉత్సవం కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులకు, గొడవలకు దారితీసింది.
కృష్ణా జిల్లా కంకిపాడులో కోడిపందాల శిబిరం వద్ద వణుకూరు మరియు పునాదిపాడు గ్రామాల యువకుల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. బీరు సీసాలతో యువకులు విరుచుకుపడటంతో కొందరు గాయపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
తూర్పు గోదావరి జిల్లాలో కోడిపందాలు, గుండాట పందాలు లక్షల్లో బెట్స్తో కొనసాగుతున్నాయి. 300 కంటే ఎక్కువ బరులు ఏర్పాటు చేసి, కోడి పందాలను బహిరంగంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ వీఐపీ పాసులు, బహుమతులు ఇవ్వడం కొనసాగుతోంది. అక్కడ కోడిపందాల ద్వారా రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు బెట్టింగ్ జరిగినట్లు సమాచారం.
పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కోడిపందాలు మూడో రోజుకు చేరుకున్నాయి. రూ.300 కోట్లకు పైగా చేతులు మారినట్లు సమాచారం. పందాల ముసుగులో పేకాట, గుండాట యథేచ్ఛగా జరుగుతున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జూద క్రీడలు కొత్త ఒరవడిని సృష్టించాయి. ఇబ్రహీంపట్నం టెర్మినల్లో క్యాసినో తరహా పేకాట శిబిరాలు ఏర్పాటు చేసి, ముడుపులు చెల్లింపులు భారీ ఎత్తున జరుగుతున్నాయి. బౌన్సర్ల సంరక్షణతో జూద క్రీడలు నడుస్తున్నప్పటికీ, స్థానిక పోలీసులు మాత్రం మౌనంగా ఉన్నారు.
ఈ సంక్రాంతి సంబరాల్లో కోడిపందాలు ఉత్సాహాన్నివ్వడమే కాకుండా, కొన్ని ప్రాంతాల్లో అభద్రతా భావానికి, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వేదికవుతున్నాయి.