మళ్లీ విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. ఆ ప్రాంతంలో మరి ఎక్కువగా.. ఆందోళనలో పౌల్ట్రీ పరిశ్రమ

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. కొంతకాలంగా ఈ వ్యాధి తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా, తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు పౌల్ట్రీ ఫామ్స్‌లో కోళ్లు భారీ సంఖ్యలో చనిపోవడంతో మళ్లీ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పశువైద్యాధికారుల పరీక్షల అనంతరం బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారణ అయింది. దీనితో పౌల్ట్రీ పరిశ్రమలో మళ్లీ ఆందోళన మొదలైంది.

చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ఓ ఫామ్‌లోని కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఫామ్‌లో దాదాపు రెండు లక్షల కోళ్లు ఉన్నట్లు సమాచారం. అలాగే భూదాన్ పోచంపల్లి మండలం, దోతిగూడెలోని మరో పౌల్ట్రీ ఫామ్‌లో కూడా ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపించింది. అక్కడ 40 వేలకు పైగా కోళ్లు బర్డ్ ఫ్లూ బారిన పడి మరణించాయి. సంబంధిత ప్రాంతాలను శానిటైజ్ చేసి, కోళ్ల ఫామ్‌ల చుట్టూ రెడ్ జోన్‌గా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. కోళ్ల మృతి చెందిన ప్రాంతాలకు ప్రజలు వెళ్లరాదని సూచనలు జారీ చేశారు.

దోతి గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో ఈ నెల 12వ తేదీన 500 కోళ్లు అనూహ్యంగా మృతి చెందాయి. యజమాని సమాచారం మేరకు పశువైద్యులు నమూనాలను సేకరించి, భోపాల్‌లోని హై సెక్యూరిటీ వీబీఆర్‌ఐ ల్యాబ్‌కు పరీక్షలకు పంపారు. అక్కడ వాటికి బర్డ్ ఫ్లూ ఉందని నిర్ధారణ కావడంతో, శుక్రవారం అధికారులు అత్యవసర చర్యలు తీసుకున్నారు.

పశువైద్య, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో 40 వేల కోళ్లు మట్టుబెట్టారు. మరణించిన కోళ్లను భద్రతా ప్రమాణాల మేరకు పూడ్చిపెట్టారు. అదనంగా 19 వేల కోడిగుడ్లను కూడా నాశనం చేశారు. ఫామ్‌లో పేరుకుపోయిన పెంటను దహనం చేసి, మూడునెలల పాటు ఫామ్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు వచ్చిన తర్వాతే పౌల్ట్రీ కార్యకలాపాలను పునరుద్ధరించుకునే వీలుందని అధికారులు వెల్లడించారు.