ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కొనసాగింపుపై చర్చించడంతో పాటుగా, సూచనలు తీసుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నిర్ణయించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ 19 రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తునట్టు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ప్రకటించాయి. ఈ సమావేశానికి అధికార వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఎం సహా ఇతర పార్టీల ప్రతినిధులు హాజరయినట్టు తెలుస్తుంది.
ముందుగా టీడీపీ పార్టీ ఈ సమావేశాన్ని బహిష్కరిస్తునట్టు ప్రకటించింది. అలాగే ఈ ఎన్నికలను కూడా బహిష్కరించాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీ నిర్ణయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
“జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ (ఎస్ఈసీ) తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరనసనగా శుక్రవారం ఎస్ఈసీ నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నాము. రెండో తేదీన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటుచేసాము, ఆ సమావేశానికి రావలసిందిగా గురువారం సాయంత్రం ఆహ్వానాన్ని పంపిన ఎస్ఈసీ, రాత్రి అయ్యేసరికి ఎన్నికలను పాత నోటిఫికేషన్ ప్రకారం కొనసాగిస్తామని, ఈ నెల 8 న పోలింగ్, 10 న ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించడం అప్రజాస్వామిక చర్యగా జనసేన భావిస్తోంది. ఈ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు తీర్పు రాక ముందే ఎస్ఈసీ ఇటువంటి దురదృష్టకరమైన నిర్ణయం తీసుకోవడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ తొందరపాటు నిర్ణయం అధికార పార్టీకి లబ్ది చేకూర్చడానికేనని జనసేన భావిస్తోంది” అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
గతంలో బీజేపీ-జనసేన స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చేసిన విజ్ఞప్తులను విస్మరించి నిన్న హఠాత్తుగా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని తనదిగా కొత్తగా నియమితులైన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని గారు చేసిన ప్రకటనను నిరసిస్తూ, రాష్ట్ర బీజేపీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఎన్నికల కమిషనర్ పిలిచిన సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించడం జరిగింది. బీజేపీ నాయకులు ఎవరూ ఈ మీటింగుకు హాజరు కారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించక ముందే రాష్ట్ర ప్రభుత్వమే ఎన్నికల షెడ్యూల్ ని మీడియాకు తెలియచేయడం దాన్ని కొత్తగా నియమితులైన రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ తన నిర్ణయంగా ఆఘమేఘాల మీద ఆమోదించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. స్వయం ప్రతిపత్తి కలిగిన ఈసంస్థ రాష్ట్ర ప్రభుత్వ పాలకపక్షం చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. దీన్ని బిజెపి పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది” అని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ