ఏపీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. వైసీపీని కుప్ప కూల్చి 164 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. అయిదేళ్ల తర్వాత తిరిగి ఏపీలో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడంలో తెలుగు దేశం పార్టీ కీలకంగా మారింది. గత రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి తగిన మద్ధతు లభించింది. కానీ ఈసారి మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ స్థానాలు దక్కడంతో మిత్ర పక్షాలపై ఆధారపడక తప్పలేదు. ఈక్రమంలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ.. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలు కీలకంగా మారాయి. దీంతో అటు కేంద్రంలో కూడా టీడీపీకి ప్రాధాన్యత పెరిగింది.
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ప్రతీ నిర్ణయంలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. ఏవైపు ఏపీలో పాలన, అభివృద్ధిపైన ఫోకస్ పెడుతూనే.. చంద్రబాబు నాయుడు తెలంగాణపై కూడా దృష్టి సారించారనే వాదన తెరపైకి వచ్చింది. తెలంగాణలో కూడా తమ పార్టీని తిరిగి ఫామ్‌లోకి తీసుకొచ్చే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తమ పార్టీ తరుపున తెలంగాణలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఏపీలో బీజేపీ-జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్లుగానే తెలంగాణలో కూడా పొత్తు ఉంటుందా? అన్న వాదన తెరపైకి వచ్చింది.
అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తెలంగాణలోనూ టీడీపీ-జనసేన-బీజేపీల పొత్తు కొనసాగే అవకాశం ఉందని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగింది. తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేసింది. కానీ ఘోర పరాజయం పాలయింది. కనీసం డిపాజిట్లు కూడా జనసేన దక్కించుకోలేకపోయింది. 8 మంది అభ్యర్థుల ఓట్లన్నీ కలిపితే 59 వేలు మాత్రమే వచ్చాయి. ఆ సమయంలో జనసేన వల్ల బీజేపీకి ఏమయినా లాభం జరిగిందా అంటే అది కూడా లేదు. కానీ ఏపీకి వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది. ఏపీలో పోటీ చేసిన 21 అసెంబ్లీ.. రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది.
తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ బీజేపీ నేతల జనసేన పట్ల కాస్త నిరాశ చెందారు. కానీ ఏపీ ఫలితాలు చూశాక ఇక్కడ కూడా జనసేనతో పొత్తు కొనసాగించాలని తెలంగాణ బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. ఇప్పటికే తెర వెనుక మంతనాలు జరుపుతున్నారట. అయితే చంద్రబాబు నాయుడు టీడీపీకి తెలంగాణలో తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు జనసేనతో పొత్తు కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఉంది. అందువల్ల ఆ పొత్తు తెలంగాణలో కూడా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. GHMC ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా ఈ కూటమి కదిలే అవకాశముంది. దీంతో 2029 ఎన్నికల వరకు తెలంగాణలో కూటమి మరింత బలపడే అవకాశం ఉందని అంటున్నారు.
తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. కానీ గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ చమటోడ్చింది. కానీ ఆ పార్టీకి చెందిన మహామహులే ఓడిపోయారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు వంటి దిగ్గజాలు ఓటమిని చవిచూశారు. కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి బీజేపీ తెలంగాణలో 8 స్థానాలను దక్కించుకుంది. క్రమక్రమంగా తెలంగాణలో పుంజుకుంటోంది. ఈక్రమంలో తెలంగాణలో కూడా పొత్తు కొనసాగిస్తే అసెంబ్లీ ఎన్నికల వరకు మరింత బలపడి.. అధికారం దక్కించుకోవచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో…
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY