మంత్రి పదవి దక్కకపోవడంపై బుచ్చయ్య చౌదరి రియాక్షన్

ap, ap cabinet, tdp, Butchaiah Choudhary
ap, ap cabinet, tdp, Butchaiah Choudhary

ఏపీలో కొత్త మంత్రి వర్గం కొలువుదీరింది. కొత్తగా 24 మంది కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. కేబినెట్ ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ, సీనియర్ సమతూకాన్ని పాటించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు మోస్ట్ సీనియర్ లీడర్లను పక్కకు పెట్టేశారు. కేబినెట్‌కు ఎంపిక చేసిన 24 మందిలో 17 మంది కొత్తవారే ఉన్నారు. ఈక్రమంలో మంత్రి పదవిపై ఆశపెట్టుకొని దక్కక.. సీనియర్లు అలకబూనారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా సీనియర్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై స్పందిస్తూ.. సంచలన కామెంట్లు చేశారు.

తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించానని.. లక్షలాది మంది ప్రజలు కూడా ఆశించారని బుచ్చయ్య చెప్పుకొచ్చారు. కానీ చివరికి తనకు దక్కలేదని.. అందుకు తనకు ఎటువంటి బాధలేదని అన్నారు. అంతేకాకుండా తనకు మంత్రి పదవి దక్కకపోవడంలో తప్పేమీ లేదని చెప్పారు. ప్రభుత్వంలో పలు సమీకరణాలు.. సర్దుబాట్లు ఉంటాయని అందువల్లో ఒక్కోసారి పదవులు దక్కవని.. అందుకు బాధపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఏ పదవి ఉన్నా లేకపోయినా 42 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని.. ఆ గుర్తింపు తనకు చాలని చెప్పుకొచ్చారు.

అలాగే ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ.. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని వైసీపీ వాళ్లు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. మరో అయిదేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తానని జగన్ అంటున్నారని.. అప్పటికి ఆయన చంచల్ గూడ జైల్లో ఉంటారో.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటారో తెలియదని విమర్శించారు. అలాగే వైసీపీ ప్రభుత్వ అండ చూసుకొని రెచ్చిపోయి తప్పులు చేసిన అధికారులను ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టేది లేదని.. చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ