ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 175 స్థానాలకు గానూ 164 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఈక్రమంలో మంగళవారం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా.. మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబును కూటమి శాసనసభాపక్ష నేతగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబు ఎన్నిక ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్‌కు పంపించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని తీర్పును ప్రజలు ఇచ్చారని, ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని వెల్లడించారు. తనను ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందకు కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 93 శాతం సీట్లు గెలిచామని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారని.. ప్రజల తీర్పుతో తమపై బాధ్యత మరింత పెరిగిందని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సమయస్పూర్తిని తాను ఎప్పటికీ మర్చిపోలేనని వెల్లడించారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందిందని వివరించారు.
ఇక బుధువారం ఉదయం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈకార్యక్రమానికి ప్రధాని మోడీ, ఎన్డీయే కూటమి నేతలు హాజరవుతారని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందిస్తామని కేంద్ర నేతలు చెప్పారని తెలిపారు. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయని.. రాష్ట్రం పూర్తిగా శిథిలమయిందని పేర్కొన్నారు. ఇకపై కక్ష్యపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్తామన్నారు. అమరావతే ఏపీ రాజధానిగా ఉంటుందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE