
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీటు రోజురోజుకు పెరిగిపోతోంది. అటు ఏపీలో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి..అధికార వైసీపీకి గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల పోలింగ్‌కు చాలా తక్కువ సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులు తమ ప్రచార జోరు పెంచారు. ఇక ఇటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో.. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. అయితే ఏపీలో కూటమి పొత్తుల ప్రభావం తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల పైన చూపుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తెలంగాణలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు లభించింది. కానీ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు రాబట్టుకోవాలనే వ్యూహంతో బీజేపీ ముందుకు వెళ్తుంది. దీనికోసం ఇప్పటికే కాషాయదళ నేత మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలంగాణ తెలుగు దేశం పార్టీ నేతలతో చర్చలు జరిపారు. చర్చల తర్వాత తెలంగాణలో బీజేపీకి తాము మద్ధతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో తాము తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈనెల 10 న అంటే రేపు ప్రధాన మంత్రి మోడీ హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా మోడీ పాల్గొనే బహిరంగ సభలో టీడీపీ శ్రేణులంతా పాల్గొనాలని చింతల రామచంద్రారెడ్డి ఆహ్వానించారట. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో లాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీడీపీ మద్దతు ఇవ్వాలని ఇటు మంత్రి పొంగులేటి వంటి నేతలు టీడీపీ ఆఫీసుకు వెళ్లి మద్దతు కోరినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు తెలుగు దేశం పార్టీ మద్దతు బీజేపీకి ఇస్తున్నట్లు తెలియడంతో ఇది తెలంగాణ సీఎంకు పెద్ద షాక్ అంటూ చర్చ సాగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY