టీటీడీపీ చీఫ్ పదవిపై పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తి నెలకొంది. అధ్యక్షపదవిని ఏ సామాజికవర్గానికి ఇస్తారనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో అన్ని పార్టీలు బీసీలకు పెద్దపీట వేయడానికి చూస్తుండటంతో.. ఆ ఈక్వేషన్‌ను కూడా పరిశీలనలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో తమ పార్టీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానుండటంతో.. పార్టీ బాధ్యతలు ఏ సామాజిక వర్గానికి చెందిన ఎవరికి అప్పగిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈనెల 7న ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతున్నారు. తెలుగు దేశం పార్టీకి తెలంగాణలో అధ్యక్షుడు లేకపోవడంతో కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలు స్తంభించాయి. మళ్లీ తెలంగాణలో తమ పార్టీపై ఫోకస్ పెట్టి పూర్వ వైభవం తీసుకువస్తానని, బలోపేతం చేస్తానని చంద్రబాబు రీసెంటుగా చెప్పారు. దీంతో చంద్రబాబు ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏపీపై మాత్రమే ఫోకస్ పెంచిన చంద్రబాబు.. రాష్ట్ర పార్టీ బాధ్యతలను తెలంగాణ నేతలకు అప్పగించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎల్.రమణ, కాసాని జ్ఞానేశ్వర్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బక్కని నర్సింహులుకు పార్టీ బాధ్యతలను అప్పగించారు. ఇలా ఈ పదేళ్లలో బడుగు, బలహీన వర్గాల వారికే అవకాశం కల్పించడంతో.. ఈ సారి ఓసీకి అవకాశం వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటికే పార్టీలో సీనియర్ నేత, పార్టీ ఉపాధ్యక్షుడు సామ భూపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, కాట్రగడ్డ ప్రసూన వంటి కొంత మందినేతలు దీని కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే టీటీడీపీ అధ్యక్షుడి నియామకం తప్పనిసరిగా మారింది. కేడర్‌కు దిశానిర్దేశం చేయడానికి, నేతలను కోఆర్డినేట్ చేయడానికి సమర్థవంతమైన నాయకుడు కావాలి. అందుకే సమర్ధవంతమైన, బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగిస్తే స్థానిక సంస్థల్లో సత్తాచాటే అవకాశం ఉంది.అలాగే ఇతర పార్టీలను కూడా ఢిపెన్స్‌లోకి నెట్టే ఛాన్స్ వస్తుంది. . అయితే ఇప్పటికే గతంలో టీడీపీలో పనిచేసి ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తున్నారని ..వారికే పార్టీ బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీలో కొనసాగుతున్న వారికి ఛాన్స్ ఇస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా టీటీడీపీ చీఫ్ పదవిపై తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE