ఏపీ ముఖ్యమంతి చంద్రబాబు కూటమి ప్రభుత్వంగా వచ్చిన తర్వాత కొత్త వ్యూహాలు అమలు చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడ రాజ్యసభలో ప్రస్తుతం తెలుగు దేశం పార్టీకి ప్రాతినిధ్యం లేదు. తాజాగా వైసీపీ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసారు.అయితే ఈ రెండు స్థానాలు ఇప్పుడు టీడీపీకి దక్కటం లాంఛనంగా కనిపిస్తోంది.
దీంతో ఈ స్థానాల్లో పార్టీ నుంచి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడానికి నిర్ణయం ఉండనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయాలలో వాస్తవాలు వార్తల్లో వచ్చినదానికంటే రూమర్లు రూటు మార్చుకుంటూ వినిపించడం కామనే. అందుకే సుహాసిని విషయంలో ఏపీ సీఎం నిర్ణయంపై కొంతమంది అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
ఇక ఇటు వైసీపీకి చెందిన రాజ్యసభ, శాసమండలి సభ్యులు వరుసగా రాజీనామాలు చేస్తూ పార్టీకి షాకులంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నారు. దీంతో..టీడీపీ ఆశావాహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వైసీపీ నుంచి ఇప్పటి వరకు మోపిదేవి, మస్తాన రావు రాజీనామా చేసారు. మరో సభ్యుడు కూడా సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే ఆ సభ్యుడు కూడా రాజీనామా చేయటం ఖాయమని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే మూడు లేదంటే రెండు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ స్థానాలు ఎలాగూ కూటమికే దక్కుతాయి.
టీడీపీ నుంచి రాజ్యసభ ఆశిస్తున్నవారి జాబితాలో కీలకనేతలు కొందరున్నారు. మాజీ ఎంపిలు కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర, పనబాక లక్ష్మీ, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లతో పాటు పార్టీ సీనియర్ నేతలు టిడి జనార్ధన్, వర్ల రామయ్య కూడా ఈ లిస్టులో ఉన్నారు. కానీ సీఎం చంద్రబాబు తాజాగా నందమూరి సుహాసినికి రాజ్యసభకు అవకాశం ఇస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి రాజ్యసభ సీటు ఇస్తే.. నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవడంతో పాటు..తెలంగాణలో పార్టీ భవిష్యత్ కు మేలు చేస్తుందని ఆయన భావిస్తున్నారట.ఒకవేళ ఒక సీటు సుహాసినికి కేటాయిస్తే..మరో సీటు కోసం గల్లా జయదేవ్, సానా సతీశ్, జనసేన నుంచి నాగబాబు పేర్లు వినిపిస్తున్నాయి.