ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు, సిబ్బంది నియామకం, కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు పనులు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం తదితర అంశాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపి, అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని, ఆగస్టు 1వ తేదీ నుంచి పెంచిన చికిత్సలను జాబితాలో చేర్చి, అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని, దశలవారీగా అమలు చేయాలని సూచించారు. అలాగే విలేజ్ క్లినిక్స్‌కు, పీహెచ్‌సీలకు డిజిటల్ వీడియో అనుసంధానత ఉండాలని అన్నారు.
కరోనా సమీక్ష సందర్భంగా ఏపీలో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులో అధికారులు సీఎం వైఎస్ జగన్ కు అధికారులు వివరించారు. ప్రస్తుతం 69 మంది మాత్రమే ఆసుపత్రుల్లో ఉన్నారని, వీరందరూ కూడా కోలుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే 87.15 శాతం మందికి ప్రికాషన్ డోసు వేశామని అధికారులు తెలుపగా, ప్రికాషన్ డోసు వ్యవధిని కేంద్రం తగ్గించినందున, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ముఖ్యంగా 60ఏళ్ల పైబడ్డ వారికి ప్రికాషన్ డోసు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా 15 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నవారికి రెండోడోసు 99.69 శాతం, 12-14 ఏళ్ల మధ్య వారికి 98.93 శాతం రెండో డోసు పూర్తి చేశామని అధికారులు తెలిపారు.
మరోవైపు ఆసుపత్రుల్లో సామర్థ్యానికి సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది నియామకంపైనా కూడా సీఎం వైఎస్ జగన్ సమీక్ష చేపట్టారు. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 40,476 పోస్టులను భర్తీ చేశామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. జూలై చివరినాటి కల్లా సిబ్బంది నియామకాలు పూర్తి చేయాలని, ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుంచి బోధనాసుపత్రి వరకూ కూడా ఉండాల్సిన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది ఉండాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. 108, 104 లాంటి సర్వీసుల్లో లంచాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఆ సేవలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఇక 16 మెడికల్ కాలేజీల్లో 14 చోట్ల పనులు ప్రారంభమయ్యాయని అధికారులు తెలుపగా, మెడికల్ కాలేజీల్లో వీలైనంత త్వరగా తరగతులు నిర్వహించేలా తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY