తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఈ రోజు మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి విజయవాడ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయినా పోలవరం ప్రాజెక్టు పనులను ఎందుకు ఆపవలసి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేసారు. ఆగస్టు 28న ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు ను పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులనుండి తప్పించారని, 20 సంవత్సరాల నుండి ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న అధికారిని ఈ ప్రభుత్వం విధులనుండి తొలగించింది అని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. పోలవరం పనులు ఆపేయడం వలన 27 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పరిపాలన అంతా తప్పుల తడకల ఉందని, వంద వైఫల్యాలు చేసారని విమర్శించారు. ఇసుక కొరత వలన వేలాదిమంది రోడ్డున పడ్డారని, వారి పార్టీకి చెందిన వారికీ లాభం చేకూర్చేందుకే నూతన ఇసుక విధానం అమల్లోకి తెచ్చారని ఆరోపించారు. టీడీపీ అవినీతి వెలికితీస్తానన్న జగన్ ఒక విషయంలో కూడ నిరూపించలేక పోయారని, ప్రభుత్వపరంగా చేస్తున్న తప్పులను కప్పి పుచ్చుకునేందుకే టీడీపీ పార్టీపై వైసీపీ నాయకులు అనవసరంగా బురద జల్లుతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్, ఇపుడు కనీసం ఆ మాట కూడ ఎత్తడం లేదని కొల్లు రవీంద్ర ఎద్దేవా చేసారు.
[subscribe]
[youtube_video videoid=nskWP88w_rM]