వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. దీంతో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ , నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ జరిగింది. ఇంకోవైపు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు విచారించనున్నారు.
ఈ సమయంలోనే మాజీమంత్రి విడదల రజిని పేరు తెర మీదకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో విడదల రజని మంత్రిగా ఉన్న సమయంలో.. ఓ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి వారి దగ్గర బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రజిని పైన విచారణ కోసం తాజాగా గవర్నర్ కు లేఖ రాసింది ఏసీబీ . ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి జాషువా విచారణకు సీఎస్ నుంచి అనుమతి కూడా లభించింది.
నిజానికి మంత్రి స్థాయి నేతల అరెస్టు సమయంలో తప్సనిసరిగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. అందుకే ఇప్పుడు విడదల రజినీ విషయంలో ఏసీబీ విచారణకు అనుమతి కోరుతూ గవర్నర్‌కు లెటర్ రాసింది. మంత్రిగా ఉన్న సమయంలో విడదల రజిని, ఐపీఎస్ అధికారి జాషువాతో కలిసి తమను బెదిరించారని స్టోన్ క్రషర్ యజమానులు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఈ ఇద్దరి విచారణకు ఏసీబీ రెడీ అవుతోంది. ముందుగా జాషువా పై విచారణ చేపట్టడానికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఏ ప్రకారం.. తాజాగా సీఎస్ అనుమతిని ఏసీబీ తీసుకుంది.అలాగే విడదల రజిని విచారణకు కూడా అనుమతించాలని కోరుతూ ఏపీ గవర్నర్ కు లేఖ రాసింది.
గవర్నర్ కు ఏసీబీ రాసిన లెటర్‌పై ఒకటి, రెండు రోజుల్లోనే ఆమోదం లభించే అవకాశం ఉంది. ఆమోదం రాగానే వారిద్దరిపై కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఆరోపణలపై ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి ఏపీ ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా సమర్పించింది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి విడదల రజనీ, జాషువా కలిసి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు.. అంతేకాకుండా అప్పటి మంత్రి విడదల రజినీకి రెండు కోట్ల రూపాయలు, ఐపీఎస్ అధికారి జాషువాకు 10 లక్షల రూపాయలు, రజిని పీఏకు 10 లక్షల రూపాయలు చెల్లించారని విజిలెన్స్ తేల్చింది.
మరోవైపు ఇటీవలే హైకోర్టులో విడదల రజనీకి ఊరట దక్కింది. తనను అరెస్టు చేస్తారేమోనని రజని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా..రజనీతో పాటు పీఏపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది ధర్మాసనం. అయితే తాజాగా గవర్నర్‌కు ఏసీబీ లేఖ రాయడం మాత్రం సంచలనం రేపుతోంది. పక్కా ఆధారాలతోనే ఏసీబీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లో విడదల రజినీ అరెస్ట్ అవడం గ్యారంటీ అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.