ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైపోయాయి. ఇప్పటికే టికెట్ దక్కిన కొందరు నేతలు కదనరంగంలోకి దూకేశారు. అటు టికెట్ దక్కని వారు.. ఇక టికెట్ రాదని అనుకున్న వాళ్లు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా నలభై సంవత్సరాలకు పైగా విశేష రాజకీయ అనుభవం.. ఎమ్మెల్యే, మంత్రిగా చేసిన అనుభవం ఉన్న ఓ దిగ్గజ నేత ప్రస్తుతం ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. ఆయనే ఆనం రామనారాయణ రెడ్డి.
కాంగ్రెస్‌లో సుధీర్ఘకాలం పాటు పనిచేసిన ఆనం రామనారాయణరెడ్డి 2018లో వైసీపీలో చేరారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుపున వెంకటగిరి నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో ఆనం గెలుపొందారు. అయితే ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడంతో జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కుతుందని ఆనం ఆశించారు. కానీ జగన్.. ఆనంకు ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. అలకబూనారు. పలుమార్లు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇక కొద్దిరోజులకు జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి సంచలనానికి తెరలేపారు. దీంతో వైసీపీ హైకమాండ్ ఆనం రామనారాయణ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తర్వాత ఆనం టీడీపీలో చేరిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆనంకు టీడీపీ ఆత్మకూర్ టికెట్ ఇవ్వాలని అనుకుంటోందట. కానీ అక్కడి నుంచే పోటీ చేసేందుకు ఆనం రామనారాయణ రెడ్డి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరు నుంచి పోటీ చేయడం ఆనంకు ఇష్టం లేదట.
ఆత్మకూరు నుంచి వైసీపీ మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రం రెడ్డిని బరిలోకి దింపుతోంది. ఆత్మకూరులో మేకపాటి ఫ్యామిలీదే పైచేయి. అక్కడ మేకపాటి కుటుంబ ఆధిపత్యమే కొనసాగుతోంది. అలాగే ఆ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ. అందువల్ల ఆత్మకూరులో వైసీపీ గెలుపు ఖాయమని.. తాను పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని ఆనం అనుకుంటున్నారట. అందుకే అక్కడి నుంచి పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారట.
మరోవైపు ఆనంకు వెంకటగిరి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని మరో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కానీ వెంకటగిరి నుంచి ఇప్పటికే కురుగొండ్ల రామకృష్ణ ఉన్నారు. ఆయన 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారట. ఈక్రమంలో ఆనం రామనారాయణ రెడ్డి ఎటూ పాలుపోలేని స్థితిలో ఉన్నారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE