రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 12 నుంచి 15 వరకు అంటే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గత 24 గంటల్లో వాతావరణ నివేదిక ప్రకారం.. తమిళనాడు, కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఉదయం నుంచి చాలా దట్టమైన పొగమంచు నమోదైంది. అయితే నవంబర్ 9 నుంచి నవంబర్ 15 మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మాహేలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి.
దీంతో పాటు నవంబర్ 9 నుంచి నవంబర్ 15 తేదీల్లో తమిళనాడు, నవంబర్ 13 నుంచి నవంబర్ 15 తేదీల్లో కేరళ, మహేతో పాటు నవంబర్ 12, 13 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో భారీ వర్షాల పడనున్నట్లు హెచ్చరిక జారీ చేశారు. నవంబర్ 10 నుంచి 12 తేదీలలో హిమాచల్ ప్రదేశ్‌లో, నవంబర్ 10 నుంచి 11 తేదీలలో వాయువ్య పంజాబ్‌లో దట్టమైన పొగమంచు కనిపిస్తుంది.
కాగా జమ్మూ కాశ్మీర్, లడఖ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, గుజరాత్‌లలో కనిష్ట ఉష్ణోగ్రత సగటు కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదవుతుంది. ఈరోజు మైదాన ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని హిండన్‌లో 13.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో, రాబోయే నాలుగైదు రోజులలో కనిష్ట ఉష్ణోగ్రతలో రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గుదల కనిపించొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నవంబర్ 12 నుంచి నవంబర్ 15 వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన వానలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనిపై వాతావరణ శాఖ .. రానున్న మూడు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది.