ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రాజధాని అంశంపై చర్చించడానికి జనవరి 7న తొలిసారిగా సమావేశమయిన హైపవర్ కమిటీ, ఈరోజు (జనవరి 10) రెండోసారి సమావేశమయింది. పాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలతో పాటు పలు కీలక అంశాలపై కమిటీ చర్చించింది. హైపవర్ కమిటీ భేటీ సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగింది. అలాగే జనవరి 13వ తేదీన కమిటీ మరోసారి సమావేశం కానున్నట్లు ప్రకటించారు.
హైపవర్ కమిటీ సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రులు, కమిటీ సభ్యులైన పేర్ని నాని, కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. పేర్ని నాని మాట్లాడుతూ జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలపై పూర్తి స్థాయిలో చర్చించామన్నారు. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదని చెప్పారు. రైతుల ప్రయోజనాలను కాపాడతామని, కావాలనే కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్నినాని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి జరుగుతుందని మంత్రి కన్నబాబు చెప్పారు. గత ప్రభుత్వంలా తమది గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని పేర్కొన్నారు. మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
[subscribe]