ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తున్న గ్రామ మరియు వార్డ్ సచివాలయం పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందనను లభించింది. ఈ పోస్టుల కోసం యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఆగష్టు 4వ తేదీ నాటికే దాదాపుగా 11 లక్షలమంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా డిగ్రీ అర్హతతో ఉన్న పోస్టులకు 6.30 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. ఇదేవిధంగా కొనసాగితే ఆఖరి గడువు ముగిసే సరికి అన్ని విభాగాలకు కలిపి 20 లక్షలకు మించి దరఖాస్తులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ మరియు వార్డ్ సచివాలయం కింద 1,26,728 పోస్టులను రాతపరీక్ష ద్వారా నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ ద్వారా జూలై 27 నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మరియు దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదిని ఆగస్టు 10గా నిర్ణయించారు. కర్నూలు, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల నుండి అధికంగా దరఖాస్తులు చేసుకున్నారని, విజయనగరం జిల్లాలో తక్కువుగా దరఖాస్తులు చేసుకున్నట్టు అధికారులు తెలియజేశారు. నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేలా పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి శాఖలు ప్రత్యేక దృష్టి సారించాయి. దరఖాస్తు చేసే విధానం, పరీక్ష తేదీలపై విద్యార్థులకు కలిగే సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసారు. అన్ని ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా రాత పరీక్ష తేదీలపై మరోసారి సమీక్ష జరపనున్నారు.
Subscribe to our Youtube Channel Mango News for the latest News.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.