కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసు

Illegal Mining Case Filed Against Former Minister Kakani Govardhan Reddy

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లాలో కేసు నమోదైంది. ఆయనపై కోట్లు విలువైన క్వార్జ్ అక్రమంగా తవ్వి తరలించారనే ఆరోపణలతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్‌లో అనుమతులు లేకుండా మైనింగ్ నిర్వహించారని, నిబంధనలను ఉల్లంఘించి పేలుడు పదార్థాలు వినియోగించారని ఆరోపణలు ఉన్నాయి.

కేసు వివరాలు 
ఈ వ్యవహారంపై మైనింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మాజీ మంత్రి కాకాణిని కేసులో నాలుగో నిందితుడిగా (A4) చేర్చారు. మొత్తం 10 మందిపై కేసు నమోదు కాగా, ఇందులో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. గూడూరు కోర్టులో హాజరుపర్చిన అనంతరం వారిని 14 రోజుల రిమాండ్‌కు పంపించారు.

రూ.250 కోట్ల అక్రమ మైనింగ్
కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ప్రధాన ఆరోపణ, లీజు ముగిసిన తర్వాత కూడా భారీగా క్వార్జ్‌ను తరలించారని. దీనివల్ల ప్రభుత్వానికి రూ.250 కోట్ల మేర నష్టం వాటిల్లిందని మైనింగ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ కేసులో వైసీపీ నేత శ్యాంప్రసాద్ రెడ్డి ప్రధాన నిందితుడిగా (A1) ఉన్నారు. అలాగే, వాకాటి శివారెడ్డి (A2), వాకాటి శ్రీనివాసులు రెడ్డి (A3) సహా మరికొందరు ఈ అక్రమ మైనింగ్‌లో పాలుపంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

దర్యాప్తు పురోగతి
ఈ కేసు గత ప్రభుత్వ హయాంలో దర్యాప్తు ప్రారంభమైనప్పటికీ, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ వేగం పుంజుకుంది. టీడీపీ నేత సోమిరెడ్డి ఈ వ్యవహారంపై కేంద్ర మైనింగ్ శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం మారిన తరువాత ఈ కేసులో స్పష్టమైన పురోగతి కనిపిస్తోంది. తాజాగా మరో ఏడుగురిని నిందితులుగా చేర్చారు.