
ఏపీ ఎన్నికలలో గెలుపోటములు ఒక ఎత్తు.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఒక ఎత్తు అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. ఏపీనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారున్న ప్రతీ చోటా కూడా పిఠాపురం నియోజకవర్గం గురించే టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. వెనుకడుగు వేయకుండా మళ్లీ ఈ ఎన్నికలలో పోటీ చేయడంతో పాటు..పిఠాపురం బరి నుంచి పోటీకి దిగడంతో అందరి చూపూ అటే పడింది. అయితే అక్కడ టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వర్మ..పవన్ కళ్యాణ్‌కు సహకరించడం లేదని.. రేపో మాపో వైసీపీ గూటికి చేరుకుంటారన్న టాక్ ఈ మధ్య బీభత్సంగా వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్‌ను ఎలాగైనా ఓడించాలన్న కసితో పని చేస్తున్న వైసీపీ..పిఠాపురంలో ఎన్ని రకాల వ్యూహాలు రచించాలో అన్నీ చేస్తోంది. ఇవేమీ పెద్దగా వర్కవుట్ అవకపోవడంతో.. వర్మను తమ వైపు తిప్పుకోవాలంటూ విశ్వప్రయత్నాలు చేస్తోంది. వర్మ వైసీపీ గూటికి చేరుకుంటే వపన్ కు అది మైనస్ గా మారుతుందన్న లెక్కలతో ఆయనకు..ఆహ్వానాల మీద ఆహ్వానాలు పంపుతూ వస్తోంది.
పిఠాపురంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉంటున్న వర్మకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసి విజయం సాధించారు. అయితే పవన్ పిఠాపురంలో నిలబడతానని ప్రకటించగానే అసంతృప్తికి లోనయిన వర్మ.. ఇండిపెండెంటుగా పోటీ చేయడానికి రెడీ అవగా చంద్రబాబు మాట్లాడటంతో వర్మ మనసు మార్చుకున్నారు. పవన్ విజయానికి తాను తోడుంటానంటూ మాటిచ్చారు.ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నారు. కానీ వైసీపీ మాత్రం ఇప్పటికీ వర్మకు గేలం వేస్తూనే ఉంది.
వర్మ విషయంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంతో కూటమి శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. దీంతో దీనిపై స్పందించిన వర్మ తనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేల్చేశారు. తాను టీడీపీ అధినేత చంద్రబాబు మనిషినని.. నాలుగు నెలల కిందటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిచయం అయ్యారని అన్నారు. పవన్ ను గెలిపిస్తానని చంద్రబాబుకు మాటిచ్చానని.. తాను మాట తప్పే మనిషిని కాదని వర్మ చెప్పుకొచ్చారు. ఇప్పుడే కాదు ఐదేళ్లుగా తనకోసం వైసీపీ ప్రయత్నం చేస్తూనే ఉందని.. తాను చంద్రబాబు మనిషినన్న విషయం తాను ఎప్పుడూ మరిచిపోనని అన్నారు. అంతేకాదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY