వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసులకు ఎదురెళ్లి మరీ అరెస్ట్ అవడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయింది. జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త అయిన చేబ్రోలు కిరణ్‌పై టీడీపీ సీరియస్ గా స్పందించిన వెంటనే సస్పెండ్ చేసింది. అంతేకాదు కిరణ్ పై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేసి తీసుకెళ్తున్న సమయంలో ప్రత్యక్షమయ్యారు గోరంట్ల మాధవ్. చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. అయితే పోలీస్ విధులను అడ్డగించారన్న కారణంతో గోరంట్ల మాధవ్ ను అరెస్ట్ చేసిన కేసు నమోదు చేశారు. అయితే ఒక మాజీ ఎంపీ..ఇలా ఒక కేసులో అరెస్ట్ అయిన నిందితుడిని తరలించడాన్ని అడ్డుకోవడం అంటే నిజంగా పోలీస్ విధులకు ఇబ్బంది పెట్టడమే. పైగా పోలీస్ శాఖ నుంచి వచ్చిన గోరంట్ల మాధవ్ కు ఇది తెలియని విషయమా అంటే అదీ కాదు. అయినా అలా రెచ్చిపోయారంటే దీనివెనుక ఏ రీజనుంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
చేబ్రోలు కిరణ్ చేసిన కామెంట్స్ ను ఎవరూ సమర్ధించరు. అందుకే తమ పార్టీ వాడయినా సరే ధర్మం వైపే ఉండాలనే సంకేతాలను అందరికీ పంపేలా టీడీపీ ఆయనపై వేటు వేసింది. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి పరిస్థితి ఉందా? అంటే ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పుకోలేని దుస్థితి ఉంది. ఇలా టీడీపీ ఎదుటవారు వేలెత్తి చూపే పరిస్థితి తెచ్చుకోకుండా మార్గదర్శకంగా వెళుతున్నా కూడా గోరంట్ల కాస్త ఓవర్ యాక్షనే చేశారు. అందుకే నిందితుడిని అరెస్టు చేసి తీసుకెళ్తుంటే దాడికి ప్రయత్నించి తనకు తానే గోతిలో పడ్డారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే గోరంట్ల మాధవ్ పై కూటమి ఫోకస్ పెట్టి.. ఆయనపై కేసులు నమోదుకు సిద్ధపడింది. సరిగ్గా ఇలాంటి సమయంలో ఎదురెళ్లి కేసులను తెచ్చుకున్నారు గోరంట్ల. అయితే దీనికి ఆయన లెక్కలు ఆయనకున్నాయని పార్టీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి ఉండేవారు. అప్పట్లో హిందూపురం సీఐగా గోరంట్ల మాధవ్ ఉండేవారు. ఓ వివాదంలో జేసీ దివాకర్ రెడ్డిని గోరంట్ల మాధవ్ సవాల్ చేసి ఏపీలో సంచలనంగా మారడంతో ..జగన్ వెంటనే ఆయనతో స్వచ్ఛంద పదవీ విరమణ చేయించి రాజకీయాల్లోకి తెచ్చారు. వైసీపీ పార్టీ టికెట్ ఇచ్చి హిందూపురం ఎంపీగా పోటీ చేయించడంతో.. ఎంపీగా గెలిచిన మాధవ్ పాలన కంటే వివాదాల వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. దీంతో 2024 ఎన్నికల్లో మాధవ్ ను పక్కన పెట్టిన జగన్.. ఎక్కడా కూడా టికెట్ ఇవ్వలేదు. పోనీ ఎన్నికల అనంతరం ఏదో ఒక నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారంటే అది కూడా జరగ లేదు. దీంతోనే ఇప్పుడు చేబ్రోలు కిరణ్ పై దాడి చేయడానికి సిద్ధపడటం వెనుక రాజకీయ కోణం ఉందన్నది ఒక అనుమానం.
ప్రస్తుతం ఏ బాధ్యతలు లేక ఉండటంతో ఆయనను పొలిటికల్ గా పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో ఏదొక నియోజకవర్గ బాధ్యతలను తనకు అప్పగించాలని ఆయన జగన్ ని కోరుతున్నారట. తన సొంత జిల్లా కర్నూలు అయినా..అనంతపురంలో అయినా ఏదో ఒక నియోజకవర్గాన్ని సర్దుబాటు చేయాలని మాధవ్ అడుగుతున్నారట.ఇప్పుడు దానికోసమే ఇప్పుడు చేబ్రోలు కిరణ్ పై గోరంట్ల దాడి అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది.ఇలా అయినా అధినేత దృష్టిలో పడితే తనకు ఏదొక పవర్ కట్టబడతారనే ఇలా చేశారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.