భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య రంగ ప్రయోగానికి సిద్దమైంది. ఈ క్రమంలో ఈరోజు (శనివారం, ఏప్రిల్ 22, 2023) తిరుపతి జిల్లా శ్రీహరి కోటలోని షార్ నుంచి పీస్ఎల్‌వీ-సీ 55 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. దీనిద్వారా సింగపూర్‌కు చెందిన 741 కిలోల టెల్ ఈవోఎస్-2 ఉపగ్రహంతో పాటు 16 కిలోల బరువున్న లుమొలైట్ అనే మరో చిన్న ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా రోదసీలోకి పంపనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11.49 గంటలకు ఇస్రో కౌంట్‌డౌన్ ప్రారంభించింది. దాదాపు 25.30 గంటలు కౌంట్‌డౌన్ కొనసాగిన తరువాత నేటి మధ్యాహ్నం 2.19 గంటలకు రాకెట్ షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. కాగా దీని రిహార్సల్‌ను శాస్త్రవేత్తలు గురువారం విజయవంతంగా నిర్వహించారు. రిహార్సల్‌లో భాగంగా రాకెట్‌ను మొబైల్ సర్వీసు టవర్ నుంచి వెనక్కి తీసుకెళ్లారు.
రిహార్సల్ అనంతరం ప్రీ కౌంట్‌డౌన్ కూడా శాస్త్రవేత్తలు నిర్వహించి రాకెట్‌లోని అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే, మిషన్ రెడీనెస్ సమీక్ష సమావేశాన్ని(ఎంఆర్‌ఆర్) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తరువాత శాస్త్రవేత్తలు ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఇక ఇటీవలే ఒక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసి సరిగా నెల రోజులు పూర్తికాక ముందే మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధం కావడం ఒక రికార్డుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇస్రో చైర్మన్ సోమనాథ్ సూళ్లూరుపేట లోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఆయన, రాకెట్ నమూనాను అమ్మవారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE