మాజీ సీఎం జగన్ తన చెల్లి షర్మిలతో వివాదం పై తొలి సారి స్పందించారు. ప్రతి ఇంట్లో జరుగుతున్న విషయాలనే ఏదో జరిగి పోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ప్రజా సమస్యలపై పోరాడుతుంటే వాటి నుంచి డైవర్ట్ చేయడానికే ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు.
తాజాగా తాను గుంటూరు, గుర్ల గ్రామాలకు వెళ్తున్నానని చెప్పి తన తల్లి, చెల్లి, తన ఫొటోలతో ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది తన ఇంట్లోనే కాదని ప్రతి ఇంట్లో కూడా జరుగుతున్న వ్యవహారమే అన్నారు. మీ ఇళ్లల్లో ఇలాంటి సమస్యలు లేవా అని జగన్ ప్రశ్నించారు. ఈ ప్రచారం వదిలేసి ప్రజా సమస్యల పైన పని చేయాలని జగన్ సూచించారు. ఇంత చిన్న విషయాన్ని రంగులద్దీ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీతో పాటుగా వారి మద్దతు మీడియా తన చెల్లి, తల్లి ఫొటోలతో రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు.
విజయనగరం జిల్లా గుర్లలో అతిసార వ్యాధితో మరణించిన వారి కుటుంబాలను జగన్ పరామర్శించారు. జిల్లా కేంద్రంకు కూత వేటు దూరంలో ఉన్న చోట ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. గుర్ల గ్రామంలో డయేరియాతో 14 మంది మరణించటం ప్రభుత్వ వైఫల్యమేనని జగన్ ఆరోపించారు. శానిటేషన్ గురించి పట్టించుకోవటం లేదని విమర్శించారు. పాఠశాలల బెంచుల పైన ఉంచి చికిత్స ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. తాను ట్వీట్ చేసే వరకు ప్రభుత్వం ఈ గ్రామంలో బాధితుల పరిస్థితి పట్టించుకోలేదన్నారు. డయేరియా బారిన పడిన వారికి కార్పోరేట్ ఆస్పత్రులకు ఎందుకు తరలించలేదని జగన్ నిలదీసారు.
వైద్యం అవసరమైన వారికి విశాఖ, విజయనగరం ఎందుకు తరలించలేదని జగన్ ప్రశ్నించారు. క్లోరినేషన్ కూడా చేయలేదన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని జగన్ హామీ ఇచ్చారు. డయేరియాతో మరణించిన వారి కుటుంబాలకు రూ 2 లక్షల చొప్పున పార్టీ తరపున ఆర్దిక సాయం ప్రకటించారు.