జనసేనకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఆ పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది . గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జనసేనను చేర్చింది. జనసేనకు గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేసింది. దీనిపై జనవరి 21 మంగళవారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక లేఖ పంపింది.తాజాగా జనసేన గుర్తింపు పొందిన పార్టీగా నిలిచి, గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకోవడం.. సుమారు దశాబ్ద కాలం తరువాత జనసేనకు పూర్తిస్థాయిలో గుర్తింపు లభించినట్లు అవడంతో..జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొంతకాలంగా జనసేన గుర్తింపుతో పాటు పార్టీ సింబల్ విషయంలోనూ పవన్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన చోట్ల శత శాతం విజయాన్ని సొంతం చేసుకుని సరికొత్త రికార్డును సృష్టించారు. ఆ సమయంలో 21 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాల్లో జనసేన పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. మొన్నటి వరకు అదొక పార్టీయేనా అని పవన్ కళ్యాణ్ పార్టీని ఎగతాళి చేశారు. గుర్తింపు లేని పార్టీగా అవమానిస్తూ… అడుగడుగునా అసహనానికి గురి చేశారు. న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయించి మరీ పార్టీ ఉనికిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అవమానాలన్నింటినీ అధిగమించి.. ఇంతింతై వటుడింతై అన్నట్టు ఆ పార్టీ పైకి ఎదిగింది.
2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినా.. ఎన్నికలలో పోటీ చేయడానికి తక్కువ సమయం ఉండటంతో .. పోటీకి దూరంగా ఉన్నారు. అప్పుడు టీడీపీకి, జాతీయస్థాయిలో బీజేపీకి మద్దతు ఇచ్చారు పవన్. అప్పుడు ఇక్కడ టీడీపీ, అక్కడ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసినా కూడా ఒకే ఒక స్థానానికి పరిమితమైంది. పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయారు. అటు పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరిపోయారు. దీంతో అసెంబ్లీలో జనసేనకు కనీస ప్రాతినిధ్యం లేకుండా పోవడం… ఎన్నికల సంఘం నిబంధనల మేరకు గుర్తింపు లేనిది పార్టీగా జనసేన పార్టీ మిగిలిపోయింది.
2024 ఎన్నికలకు ముందు జనసేన సింబల్ విషయంలో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలయింది. అదే సమయంలో ఏపీ నుంచి గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల్లో వైసీపీతో పాటు టీడీపీకి మాత్రమే చోటు దక్కింది. జనసేన పార్టీ విషయానికి వస్తే.. మాత్రం రిజిస్టర్ పార్టీల జాబితాలో మాత్రమే ఆ పార్టీ చోటు దక్కించుకుంది. దీంతో ఆ పార్టీ సింబల్ గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్స్ జాబితాలోకి వెళ్లిపోయింది. అప్పట్లో జనసేన పోటీ చేసిన చోట మాత్రమే ఆ పార్టీ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తామని… ఒకవేళ ఆ పార్టీ అభ్యర్థి లేకపోతే.. ఇండిపెండెంట్ కు అదే సింబల్ కేటాయించి అవకాశం ఉంటుందని ఈసీ తెలిపింది. . అయితే అప్పట్లో జనసేన న్యాయపోరాటం చేయడంతో గాజు గ్లాసు గుర్తు కేటాయింపు ప్రక్రియ నిలిచిపోయింది.
కాగా..ఈసారి ఎన్నికలలో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. పోటీ చేసిన అన్ని చోట్ల కూడా జనసేన విజయం సాధించింది. శత శాతం గెలుపుతో ఓట్లు, సీట్లు పెంచుకోవడంతో నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం..జనసేనను గుర్తింపు గల పార్టీగా గుర్తించింది. ఆ పార్టీకే గాజు గ్లాస్ గుర్తును శాశ్వతంగా రిజర్వ్ చేసింది. ఈసీ నిర్ణయంపై జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు జనసేన పార్టీకి శాశ్వత గుర్తింపు దక్కడంపై తెలుగుదేశం పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.