ఏపీ, తెలంగాణలను అతలాకుతలం చేస్తున్న వర్షాలు, వరద సహాయక చర్యల కోసం జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాలం అందజేసి తన పెద్ద మనసు చాటుకున్నాడు. గత మూడు, నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలనూ భారీ వర్షాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ, ఖమ్మంలాంటి నగరాలు అయితే పూర్తిగా వరదల్లో చిక్కుకున్నాయి. దీంతో తారక్ తన వంతుగా రూ.కోటి సాయం ప్రకటించాడు. తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం తనను కలచివేసిందని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అతి త్వరగా తెలుగు ప్రజలు కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయపడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణకు చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్లు జూ.ఎన్టీఆర్ వెల్లడించారు.
విశ్వక్సేన్ రూ.10 లక్షలు, సిద్ధు రూ.30 లక్షలు : నటులు విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ సైతం ఇరురాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. తారక్ ను ఎంతగానో అభిమానించే విశ్వక్సేన్.. సాయం విషయంలోనూ అతని బాటలోనే వెళ్తున్నాడు. రెండు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు ఇస్తున్నట్లు అతడు ఎక్స్ ద్వారా తెలిపాడు. సిద్ధు జొన్నలగడ్డ చెరో రూ.15 లక్షల చొప్పున రూ.30 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు వెల్లడించారు.
త్రివిక్రమ్ రూ.50 లక్షలు : వీరితో పాటు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత ఎస్.రాధాకృష్ణ, నాగవంశీలు కలిసి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ఇరు రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షల చొప్పున సీఎం సహాయ నిధికి జమ చేశారు. ఇక ఇటీవలే కల్కితో భారీ విజయాన్ని అందుకున్న వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్‌కు రూ.25 లక్షల సాయం ప్రకటించారు. కాగా కష్ట సమయంలో టాలీవుడ్ అండగా నిలవడాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు కొనియాడుతున్నారు. అయితే మరికొందరు స్టార్ హీరోలు ఇప్పటికి సహాయం చేయకపోవడం పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో తెలుగు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, ఏపీలోని విజయవాడ, కృష్ణా జిల్లాల పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి. వాగులు, వంకలు పొంగి ప్రధాన రహదారులు, కాలనీలను చెరువులుగా మార్చేశాయి. దీంతో ప్రజలు గత మూడు రోజులుగా వరద నీటిలోనే ఉంటూ, పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. అన్నీ కోల్పోయిన తమకు కట్టుబట్టలే మిగిలాయని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.