ఏపీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్‌లు తగులుతున్నాయి. తీవ్ర కష్టాలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. ఓవైపు పార్టీ ఉనికి కోల్పోకుండా కాపాడుకోవడం.. మరో వైపు పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవ్వగుండా చూసుకోడం ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సవాల్‌గా మారింది. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు అధికారపక్షం వైపు చూస్తున్నారు. ఎప్పుడు సమయం వస్తుందా?.. ఎప్పుడు అధికారపక్షంలోకి జంప్ అవుదామా? అని ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య. ఓవైపు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తుంటే.. ఇటు కిలారి రోశయ్య ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడే కిలారి రోశయ్య. 2019లో వైసీపీ తరుపున పొన్నూరు నుంచి పోటీ చేసి రోశయ్య గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా రోశయ్య పొన్నూరు టికెట్ ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన్ను అసెంబ్లీ ఎన్నికల బరిలో నుంచి తప్పించి లోక్ సభ ఎన్నికల బరిలోకి దించారు. గుంటూరు పార్లమెంట్ నుంచి ఎంపీగా రోశయ్యను పోటీ చేయించారు. కానీ టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో కిలారి రోశయ్య దాదాపు మూడు లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి కిలారి రోశయ్య వైసీపీ హైకమాండ్ పట్ల అంటీ అంటనట్లు ఉంటున్నారు. పార్టీ సమావేశాలకు కూడా రోశయ్య హాజరు కావడం లేదు.
తాజాగా తన అనుచరులతో రోశయ్య ఆత్మీయ సమావేశం అయ్యారు. వారితో చర్చలు జరిపిన తర్వాత వైసీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించారు. వైసీపీ కొందరి చేతుల్లోనే నడుస్తోందని.. కష్టపడిన వారికి ఆ పార్టీలో గుర్తింపు లేదని రోశయ్య ఆరోపించారు. గుంటూరు పార్లమెంట్ నుంచి ఎంపీగా తనను నిలబెట్టారని.. కొందరు మానసికంగా తనను కుంగదీశారని వెల్లడించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా కొందరు ఇష్టారాజ్యంగా పార్టీని నడుపుతున్నారని.. అటువంటి పార్టీలో తాను ఉండలేనని రోశయ్య వెల్లడించారు. త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని అన్నారు. అయితే రోశయ్య తర్వాత ఏ పార్టీలో చేరుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఆయన జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్‌తో రోశయ్య టచ్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో..
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE