అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పొత్తులు-ఎత్తులు, జంపింగ్‌లు తెరపైకి వస్తున్నాయి. అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లాల ఇంఛార్జ్‌లను మార్చడం కాకరేపుతోంది. సరిగ్గా ఇదే సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ అధిష్టానికి గట్టి షాక్ ఇచ్చారు. తన పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం.. ఈసారి మంగళగిరి టికెట్ వేరే వారికి ఇవ్వనున్నట్లు వార్తలొస్తుండడంతో అసంతృప్తికి గురైన ఆర్కే రాజీనామా చేశారు.
ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ షర్మిలతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. మరో వారం రోజుల్లో పార్టీని విలీనం చేసి కాంగ్రెస్‌తో చేతులు కలపనున్నారు. అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా షర్మిలకు ఏపీపీసీసీ బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. లేదంటే ఏపీ కాంగ్రెస్ అబ్జర్వర్‌గా నయినా షర్మిలను నియమించే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది.
ఈక్రమంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే.. తాను ఆమె వెంటే నడుస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వైఎస్సార్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా వైఎస్ షర్మిల వెంటే ఉంటానని.. షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే నడుస్తానని ఆర్కే స్పష్టం చేశారు. వైసీపీకి తాను ఎంత సేవ చేశానో తనకు మాత్రమే తెలుసునని.. తాను సర్వం పోగొట్టుకున్నానని వెల్లడించారు. మంగళగిరిని తన సొంత డబ్బులతో అభివృద్ధి చేశానని చెప్పారు. మంగళగిరిని రూ. 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి కేవలం రూ. 120 కోట్లు మాత్రమే కేటాయించారని వెల్లడించారు. అయినప్పటికీ తన సొంత నిధులతో 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించానని చెప్పుకొచ్చారు.
తాను రాజీనామా చేసిన తర్వాత చాలా మంది తనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారని ఆర్కే చెప్పుకొచ్చారు. కానీ తాను వైఎస్ కుటుంబంతోనే ఉన్నానని.. ఆ కుటుంబంతోనే ఉంటానని చెప్పానని వెల్లడించారు. అందుకే వైఎస్ షర్మిల వెంట నడవాలని నిర్ణయించుకున్నానని ఆళ్ల రామకృష్ణా రెడ్డి వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE