మనలో సామర్ధ్యం,ప్రతిభ ఉన్నా కూడా అది గుర్తించే టైమ్ రాకపోతే అదంతా మరుగున పడిపోతుంది. స్థాయి తక్కువ వాళ్లతో కూడా మాటలు పడాల్సి వస్తుంది. అదే టైమ్ మనకు అనకూలంగా మారిన రోజు అన్నీ బయటపడతాయి. ప్రతిభ, సామర్థ్యం వెలుగులోకి వచ్చి కావాల్సినంత గుర్తింపు వస్తుంది. అప్పుడు అడ్డమైన చెత్తా వాగిన నోళ్లు .. ఒక్కసారిగా మూగపోతాయి. అచ్చంగా ఇప్పుడు నారా లోకేష్ విషయంలోనూ అదే జరుగుతుంది.
అవును..ఇన్ని రోజులు లోకేష్ అంటే వైసీపీ నేతలకు ఎంత చిన్న చూపో వాళ్లు అడ్డుదిడ్డంగా చేసిన కామెంట్లు చెప్పకనే చెప్పాయి. కనీసం నాయకుడిగా గుర్తించకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడి ఆయన స్థాయిని దిగజార్చారు. కానీ ఇదంతా గతం..ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలోనే కాదు తెలంగాణ బీజేపీ నేతలు గుర్తించే స్థాయికి లోకేష్ చేరుకున్నారు. అంతేకాదు బుధవారం విశాఖలో జరిగిన సంఘటనతోనూ కేంద్రంలోనూ లోకేష్‌కు ఎనలేని ప్రాధాన్యం పెరుగుతోందన్న విషయం మోదీ అందరిలోనూ క్రిస్టల్ క్లియర్‌గా చెప్పేశారు .
ఇటీవల కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా తెలంగాణ బీజేపీ తమ పోస్టర్లలో ముఖ్య నాయకుల ఫోటోలను ముద్రించగా.. అందులో లోకేష్‌కు స్థానం దక్కింది. బీజేపీ అగ్ర నేతలుగా ఉన్న ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీఏ నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు లోకేష్ ఫోటోలు కూడా ప్రచురించారు. జనవరి 8న ప్రధాని పర్యటన సందర్భంగా తాజాగా విశాఖలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలలో.. అగ్రనేతల సరసన లోకేష్ ఫోటో కనిపించింది. ప్రధాన మోదీకి స్వాగతం పలుకుతూ ముద్రించిన ఫ్లెక్సీలలో ప్రధాని మోదీకి ఒకపక్క పవన్ ఉండగా.. మరోపక్క చంద్రబాబుతో పాటు లోకేష్ ఉన్నారు.
ఈ ఎన్నికలకు ముందు లోకేష్..టీడీపీ నేతగా కూడా గుర్తించకుండా వైసీపీ నేతలు రెచ్చిపోయారు . అయితే చంద్రబాబు అరెస్టుతో పాటు మరి కొన్ని ఇతర సందర్భాల్లో లోకేష్ నాయకత్వాన్ని మెల్లమెల్లగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించడం మొదలుపెట్టారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కేంద్ర పెద్దల సాయాన్ని కోరుతూ ఏకంగా ఢిల్లీ వెళ్లారు లోకేష్. దీనికి ముందు ఏపీలో సుదీర్ఘకాలం పాదయాత్ర కూడా చేశారు. అంతేకాదు టీడీపీలో చంద్రబాబు తర్వాత తానే ఉంటూ ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా చూపించి పార్టీని ఒక్కటిగా ఉంచడంలో సఫలీకృతులయ్యారు.అయితే ఎన్ని చేసినా, ఏం చేసినా లోకేష్‌కు మాత్రం అప్పుడు తగిన గుర్తింపు రాలేదు.
కానీ నిప్పును ఎంతో కాలం అదిమిపెట్టలేరన్నది ఎంత నిజమో.. ప్రతిభ ఉన్నవాళ్లను బయటకు రాకుండా చేయలేరన్నది కూడా అంతే వాస్తవం. ఇప్పుడు అదే జరుగుతోంది. తాజా సంఘటన దీనిని మరోసారి ప్రూవ్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఎంత ప్రాముఖ్యత ఇస్తూ వచ్చారో.. జనవరి 8న జరిగిన విశాఖలోని భారీ బహిరంగ సభలో లోకేష్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయింది. అందరికీ నమస్కారం చేస్తూ వచ్చిన మోదీ.. లోకేష్ దగ్గర ఆగి మరీ ఆయనను ఢిల్లీకి ఆహ్వానించడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తంగా లోకేష్ పప్పు కాదు.. నివురుగప్పిన నిప్పు అని వైసీపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.