ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ ధరల సవరణకు సంబంధించి సోమవారం నాడు కొత్త జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ ధరల కోసం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ/గ్రామ పంచాయతీలుగా విభజన చేస్తూ, నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్స్, మల్టీ ఫ్లెక్సీల వారీగా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్రంలో సినిమా టికెట్ కనీస ధర రూ.20 ఉండగా, గరిష్ఠంగా రూ.250గా నిర్ణయించారు. సినిమా టికెట్ ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
“తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా, అటు థియేటర్ల మనుగడను, ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా టికెట్ రేట్లను సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పరిశ్రమ తరుఫున కృతజ్ఞతలు. చిన్న సినిమాకు ఐదవ షోకు అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధిత మంత్రివర్యులు పేర్ని నానికి, అధికారులకు, కమిటీకి ధన్యవాదాలు” అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మరోవైపు రెబెల్ స్టార్ ప్రభాస్ సహా పలువురు సినీ ప్రముఖులు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ