తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. చిలికి చిలికి గాలీవానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఆరోపణలు- ప్రత్యారోపణలకు కారణమైంది. తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కలకలం రేగడంతో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల ప్రసాదాల తయారీపై అందరి దృష్టి పడింది.
ఇప్పటికే సింహాచలం నరసింహాస్వామివారి ఆలయంలో ప్రసాదం నాసిరకంగా ఉంటోందంటూ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఆలయంలో ప్రసాదాల తయారీని ఆయన పరిశీలించారు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం కూడా చేరింది. ఈ ఆలయంలో కూడా ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి, నాసిరకం పదార్థాలను వినియోగిస్తోన్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనితో టీడీపీకే చెందిన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు శాసన సభ్యురాలు సత్యప్రభ.. కొద్దిసేపటి కిందటే అన్నవరం ఆలయాన్ని సందర్శించారు. ప్రసాదశాల తయారీ కేంద్రాలను సందర్శించారు. అక్కడ నిల్వ ఉంచిన నెయ్యి డబ్బాలను పరిశీలించారు. వాటిని సరఫరా చేస్తోన్న కాంట్రాక్టర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెయ్యి రుచి చూశారు.
అన్నవరం సత్యదేవుని ప్రసాదం తయారీకి నెయ్యి సరఫరా చేసే గుత్తేదారుడు ఒక్కో ఆలయానికి ఒక్కో ధర వసూలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. పైగా అన్నవరం దేవాలయానికి రెండేళ్లుగా ఒకే గుత్తేదారుడు నెయ్యి సరఫరా చేయడంపై చర్చనీయాంశమైంది. తిరుమల ఆలయంలో కల్తీ నెయ్యి వినియోగంతో అన్నవరం ఆలయంలో ప్రసాదం తయారీని స్థానిక ఎమ్మెల్యే వరపు సత్యప్రభ తనిఖీ చేశారు. సరుకుల టెండర్లు, స్టాక్, ల్యాబ్ రిపోర్ట్‌లను పరిశీలించారు. పరీక్షలు చేయించేందుకు ప్రసాదం తయారు చేసే సరుకుల నమూనాలను అధికారులు సేకరించారు.
అన్నవరం సత్యదేవుడి ప్రసాదంలో కల్తీ జరుగుతోందంటూ అభియోగాలు రావడంతో తాను ప్రసాద తయారీని పరిశీలించానని అన్నారు ఎమ్మెల్యే సత్యప్రభ. ఆరు నెలలకు ఒకసారి నెయ్యి, ఇతర ప్రసాదాల తయారీ పదార్థాలను సరఫరా చేయడానికి టెండర్లను పిలవాల్సి ఉన్నప్పటికీ- రెండేళ్లుగా ఒకే వ్యక్తికి ఈ కాంట్రాక్ట్ ఇస్తోన్నారని చెప్పారు. నెయ్యి, ఇతర వస్తువుల శాంపిళ్లను సేకరించి, వాటిని పరీక్షల కోసం పంపించనున్నట్లు సత్యప్రభ తెలిపారు. ఈ అభియోగాలపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్నవరం ఆలయానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని, వాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా వాస్తవాలు బయటపెట్టాలని చెప్పారు.