ఏపీలో గంజాయి, డ్రగ్స్ కట్టడికి ఏపీ ప్రభుత్వం ఈగల్ అనే సరికొత్త ఫోర్స్ ఏర్పాటు చేసింది. అమరావతిలో కేంద్ర కార్యాలయంతో పాటు 26 జిల్లాల్లో..ఈ ఈగల్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.
దేశంలో జరిగిన అనేక నేరాలకు మత్తే కారణమని తేలుతోంది. అందుకే గంజాయి, డ్రగ్స్ గురించి సోదాలు చేస్తూ వాటి కట్టడిపై అన్ని రాష్ట్రాలు ఫోకస్ పెట్టాయి. అయితే ఏపీలో కొన్నేళ్లుగా గంజాయి, మత్తు పదార్థాల రవాణా జోరుగానే సాగుతోంది. మిగతా ప్రాంతాల్లో గంజాయి పట్టుపడితే దాని మూలాలు మాత్రం ఏపీలోనే తేలుతుండటంతో..కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది.
డ్రగ్స్ నియంత్రణకు కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.ఈగల్.. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ ఫోర్స్ మెంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గంజాయి, డ్రగ్స్ ను ఉక్కు పాదంతో నియంత్రించడానికి ఈ ఈగల్ దోహదపడనుంది. అమరావతిలో ఈగల్ సెంట్రల్ ఆఫీసు , జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ.. ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
వైసీపీ ప్రభుత్వం గతంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసినా.. ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు ఎటువంటి ప్రత్యేక నియమకాలు చేపట్టలేదు. ఎక్సైజ్ శాఖలోనే కొంతమంది సిబ్బందిని దీనికోసం సర్దుబాటు చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈగల్ ఏర్పాటు చేస్తోంది. ఈగల్ కోసం ప్రత్యేకంగా పని చేయడానికి సిబ్బందిని కూడా సర్దుబాటు చేయనున్నారు.
ఈగల్‌లో పనిచేసే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగులకు 30శాతం అలవెన్స్ కూడా ఇవ్వనున్నారు. అమరావతిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్, మిగతా 26 జిల్లాల్లో కూడా డిస్ట్రిక్ట్ నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేస్తూ తాజాగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
గంజాయి, డ్రగ్స్ కేసుల విచారణకు వైజాగ్, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయబోతున్నారు. అదనపు డీజీ లేదా ఐజి స్థాయి అధికారి ఈగల్ ఫోర్స్ కు పర్యవేక్షిస్తారు. మొత్తం దీనికోసం 459 మంది సిబ్బందిని నియమించగా.. వీరిలో ఒక ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు కూడా ఉన్నారు. అమరావతి సెంట్రల్ ఆఫీసులో 24 గంటలు కూడా సేవలందించే కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.