ఏపీ రాజ్‌భవన్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు చిన్నారులు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా గవర్నర్‌ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, డాలర్‌ శేషాద్రిలు గవర్నర్‌ను కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆతర్వాత గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు టీటీడీ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు.

అలాగే నూతన సంవత్సర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి టీటీడీ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. తాడేపల్లిలోని నివాసంలో సీఎంకు వేదపండితులు ఆశీర్వచనాలు ఇచ్చి శ్రీవారి తీర్ధప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, దేవాదాయా శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్ ను కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే డీజీపీ గౌతమ్ సవాంగ్ తో పాటుగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

[subscribe]