
ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ ముగియడంతో మరికొద్ది రోజుల్లో రాబోతోన్న ఫలితాలపైనే అందరి దృష్టీ పడుతోంది. జూన్ 4న ఏపీ ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారా అన్న ఆసక్తి పెరుగుతోంది. అయితే ఎవరు గెలిచినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాలన అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రజాభిప్రాయం ఈవీఎంలలో నిక్షిప్తమవడంతో..ప్రజల తీర్పుతో జూన్ 9 నుంచి కొత్త ప్రభుత్వం తమ పాలన ప్రారంభించనుంది. అయితే ఇప్పటికే కుదేలయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితితో ఇచ్చిన హామీలు, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటివి అమలు చేయడం ఏ పార్టీకి అయినా ఆషామాషీ విషయం కాదు. కొత్త ప్రభుత్వం పాలన ఒక గాడిలో పడాలంటే దాదాపు ఒక ఏడాది అయినా సమయం కావాలి. చంద్రబాబే కాదు జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చినా ఇదే పరిస్థితి తలెత్తనుంది.
విపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 12 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ అప్పును భరించాల్సిన పరిస్థితిలో కొత్త ప్రభుత్వం ఉంది. దీనికితోడు కూటమి అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ..పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పరుస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాదు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు.. ప్రతి ఇంట్లో ఆర్థిక భరోసా, పిల్లల చదువు కోసం ప్రోత్సాహం, సాగు కోసం పెట్టుబడి నిధి వంటి భారీ సంక్షేమ పథకాలను తాము అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో పెట్టింది. అయితే ఇప్పుడు ఏపీ ఉన్న పరిస్తతుల్లో ఇవన్నీ అమలు చేయడం కత్తి మీద సాము లాంటిదే.
నిజానికి ఇలాంటి ఉచిత పథకాలు ప్రజలను మరింత బద్దకస్తులను చేస్తాయన్న ఉద్దేశంతో ఉండే చంద్రబాబు ..కేవలం జగన్ ను ఓడించడానికే వైసీపీకి పోటాపోటీగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఒకవేళ చంద్రబాబు కనుక అధికారంలోకి వస్తే వీటన్నింటినీ అమలు చేస్తారా? లేకపోతే ప్రజలకు జగన్ మిగిల్చిన అప్పుల గురించి రాష్ట్ర పరిస్తితి గురించిన వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 60 లక్షల మంది సామాజిక పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ఈ పెన్షన్ ను నాలుగు వేల మొత్తాన్ని పెంచుతానని కూటమి ప్రకటించింది.అలాగే దివ్యాంగులతో పాటు కిడ్నీ బాధితులకు పింఛన్ మొత్తాన్ని పెంచుతామని కూడా చెప్పుకొచ్చింది.ఇప్పుడు ఆ పథకాలను అమలు చేయాలంటే కష్టతరంతో కూడుకున్న పని అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు అభివృద్ధి చేపట్టాలి.. అమరావతి రాజధానిని కూడా డెవలప్ చేయాలి.
ఒకవైపు రాష్ట్ర సంపద పెంచుతూనే.. సంక్షేమం, అభివృద్ధికి ఈక్వల్ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఐదేళ్ల గడువులో రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలంటే దాదాపు రెండేళ్ల సమయం వరకూ పడుతుంది. ఈ రెండేళ్లలో అప్పులు తగ్గించుకోవడంతో పాటు. కొత్త అప్పులు పుట్టించుకుంటూనే… రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచుకోవాలి. ఇవన్నీ ఏపీలో అధికారం వచ్చిన ఏ పార్టీకయినా పెద్ద సవాలే అన్నది విశ్లేషకుల మాట. దీంతో ఇల్లు అలకగానే పండుగ కాదు అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాలకు కరెక్టుగా సరిపోతుందన్న టాక్ వినిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY